ఒకే సిరెంజ్‌తో 30మందికి కరోనా వాక్సిన్
కరోనా వాక్సినేషన్ ప్రక్రియ అత్యంత వేగంగా చేసుకుంటూ దాదాపు 200 కోట్లకు పైగా వాక్సిన్ డోసులతో రికార్డు సృష్టించిన భారత్‌లో కూడా అప్పుడప్పుడు అవకతవక సంఘటనలు జరుగుతున్నాయి. నిన్న మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో జైన్ పబ్లిక్ స్కూల్‌లో 30 మంది పిల్లలకు వాక్సినేషన్ వేసే ప్రక్రియలో పెద్దతప్పు జరిగింది. జితేంద్ర అనే వ్యక్తి ఒకే సిరెంజ్‌తో 30 మందికి వాక్సిన్ వేయడం జరిగింది. 1990 నుండి ఎయిడ్స్ వ్యాప్తిని అరికట్టడానికి భారతప్రభుత్వం డిస్పోజబుల్ సిరెంజ్‌లను ప్రవేశపెట్టింది. మళ్లీమళ్లీ ఉపయోగించే సిరంజ్‌లను రద్దు చేసింది. ఈ సంఘటనపై పిల్లల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ జితేంద్రను ప్రశ్నించగా, తనకు హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్ నుండి ఒకటే సిరంజి వచ్చిందని, దానినే వాడమంటూ ఉత్తర్వులు వచ్చాయని, నా తప్పేం ఉంది అంటూ తప్పించుకోబోయాడు. దీనిని విద్యార్థుల తల్లిదండ్రులు వీడియో రికార్డ్ చేసారు.
ఈ ఘటన పై సాగర్ జిల్లా అడ్మినిస్ట్రేషన్ వారు జితేంద్రపై కేంద్రప్రభుత్వ వాక్సినేషన్ నిబంధనలను అతిక్రమించినందుకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసారు. డిస్ట్రిట్ ఇమ్యూనైజేషన్ ఆఫీసర్ డాక్టర్ రాకేష్ రోషన్‌పై కూడా సరిగ్గా వాక్సినేషన్‌కు అవసరమైన సంబంధిత సామాగ్రిని సరఫరా చేయనందుకు అంతర్గత విచారణను చేపట్టబోతున్నారు. కలెక్టర్ క్షితిజ్ సింఘల్ ఈ సంఘటనపై వెంటనే స్పందించి హెల్త్ ఆఫీసర్‌ను, చీఫ్ మెడికల్ ఆఫీసర్స్‌ను విచారణకు పంపగా జితేంద్ర అందుబాటులో లేడని, అతని ఫోన్ కూడా స్విచ్చాఫ్ చేసారని తెలిసింది. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.