తవ్వేకొద్దీ… గుట్టలుగా చికోటి చీకటి కోణాలు
గుడివాడలో బయటపడిన క్యాసినో వ్యవహారం “ఇంతితై వటుడింతై” అన్నట్లు వామన మూర్తిలా పెరిగిపోతోంది. దేశవిదేశాలలో క్యాసినో నిర్వహిస్తున్న ప్రవీణ్, మాధవరెడ్డి అండ్ టీం పై జూదం పేరుతో నిధులు మళ్లిస్తున్నారనే సమాచారంతో ఈడీ వరుసగా సోదాలు నిర్వహిస్తోంది. గోవాలో క్యాసినోలు నిర్వహించడంతోపాటు నేపాల్, థాయ్‌లాండ్‌లలో జరిగే జూదంలో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు చెందిన చీకోటి ప్రవీణ్, మాధవరెడ్డి సహా కొందరు ప్రత్యేక టూర్లు ఏర్పాటు చేస్తూ, కస్టమర్‌ల దగ్గర రానుపోను ఖర్చులతో కలిపి 5 రోజులపాటు విదేశాల్లో ఉండేందుకు ఒక్కొక్కరి నుంచి దాదాపు 5 లక్షల వరకు వసూలు చేస్తున్నారని తెలిసింది. గతంలో ఎక్కువ మందిని శ్రీలంక తీసుకెళ్లేవారని, ఇప్పుడు అక్కడి పరిస్థితులు బాగోకపోవడంతో నేపాల్‌కు తరలిస్తున్నట్టు సమాచారం. ప్రవీణ్ రెగ్యులర్ కస్టమర్లు 200 మంది ఉంటారని అంచనా.
తవ్వేకొద్దీ ఈకేసులో బడాబాబులు బయటపడుతున్నారు. వీరికి టాలీవుడ్‌తో బాటు బాలీవుడ్‌కు కూడా చెందిన వ్యక్తులతో సంబంధాలు ఉన్నట్లు తెలిసింది. నేపాల్ వెళ్లిన కస్టమర్లలో 16 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు సమాచారం. ఏపీ, తెలంగాణకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, డీసీసీబీ ఛైర్మన్లు వీరి ఖాతాదారుల లిస్ట్‌లో ఉన్నారు. ఈకేసులో ఈడీ బాగా దూకుడు పెంచింది. ఈడీ చికోటి ఫోన్, ల్యాప్‌టాప్‌ను సీజ్ చేసారు. వారి లావాదేవీలకు సంబంధించి చికోటి వాట్సాప్‌లో సమాచారాన్ని బట్టి చికోటికి చెందిన 4 బ్యాంకు అకౌంట్లను గుర్తించారు. చికోటి వాట్సాప్‌లో ప్రముఖులతో చాటింగ్ వ్యాపార, రాజకీయవేత్తలతో పరిచయాలు ఉన్నట్లు గుర్తించి పెద్దమొత్తంలో హవాలా జరిగినట్లు గమనించి, సినీ, రాజకీయ నేతలకు నోటీసులు ఇవ్వబోతున్నట్లు తెలియజేసారు. 10 మంది సినీ ప్రముఖులతోపాటు 20 మంది విఐపిలకు కూడా నోటీసులు ఇవ్వబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతే కాక బిగ్‌డాడీ అడ్డా ప్రమోషన్ కోసం సినీతారలతో కూడా ఎర వేయించినట్లు తెలుస్తోంది. బేగంబజార్, జూబ్లీహిల్స్ సికింద్రాబాద్ చెందిన బ్రోకర్స్ ఇండ్లలో ఈడీ సోదాలు నిర్వహించింది.
ఏకంగా 20మంది ఈడీ అధికారులతో 10 చోట్ల ఏకకాలంలో రైడ్స్ జరిగాయి. ప్రవీణ్ హవాల రుపంలో ఈ నలుగురికీ పెద్ద మొత్తంలో లావాదేవీలు నడిపాడని కనిపెట్టారు. వీరి పేర్లు సంపత్, బబ్లు, రాకేష్, వెంకటేష్‌లుగా గుర్తించారు. ప్రవీణ్ బెట్టింగ్ సామ్రాజ్యాన్ని అంతటినీ సంపత్ నిర్వహిస్తున్నాడనీ తెలుసుకున్నారు. బడా రాజకీయ నేతలతో పెద్ద మొత్తంలో సంపత్‌కి లావాదేవీలు జరిగాయి. మొన్నటికిమొన్న మినిష్టర్ మల్లారెడ్డి కారు స్టిక్కర్ వ్యవహారంతో బయటపడగా, తాజాగా ఉమ్మడి మెదక్ జిల్లా నేతలతో కూడా సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. చికోటి గోవాకు వెళ్లినప్పుడు మెదక్ జిల్లా ప్రముఖులు, వ్యాపారవేత్తలు పరిచయమయ్యారని, ఈనెల 19న తన పుట్టినరోజు వేడుకలు ఏడుపాయలలోని హరిత హోటల్‌లో ఆర్భాటంగా జరుపుకున్నాడనీ, దానికి దాదాపు 150 మంది ప్రముఖులు హాజరయ్యారనీ బయటపడింది. ఈ లిస్ట్‌లో ఉమ్మడి మెదక్ జిల్లా DCCB చైర్మన్ పేరు బాగా వినిపిస్తోంది.
బిగ్‌డాడీ అడ్డా ప్రమోషన్ కోసం సినీతారలతో చేసిన ప్రోమోలను కూడా వాట్సాప్‌లో ప్రముఖులకు పంపించినట్లు తెలిసింది. దీనికోసం సినీతారలకు కోట్లలో సొమ్ములు ముట్టజెప్పినట్లు సమాచారం. ప్రవీణ్ వాట్సాప్ డేటాను బ్యాక్‌అప్ చేసి ఈసమాచారాన్ని సేకరించారు ఈడీ అధికారులు. ఈడీ అధికారులు చీకోటి చీకటి సామ్రాజ్యాన్ని ఒక్కొక్కటిగా బయటకు లాగుతున్నారు. ఇందులో భాగంగానే కడ్తాల్ సమీపంలో 20ఎకరాల్లో నిర్మించుకున్న చీకోటి ఫామ్ హౌస్‌ను కూడా గుర్తించారు. ఇక్కడ చాలామంది బిగ్‌షాట్స్, వీవీఐపీలు కూడా రిలాక్స్ అవడానికి వస్తుంటారని సమాచారం రాబట్టారు. పైగా ఈ ఫామ్‌హౌస్‌లో మామూలు పెంపుడు జంతువులతో పాటు ఆఫ్రికన్ దేశాలకు చెందిన బల్లులు, పాములు, పక్షులు ఉన్నట్లు కూడా గుర్తించారు. వన్యప్రాణుల చట్టానికి వ్యతిరేఖంగా వాటిని ఫామ్‌హౌస్‌లో పెట్టడం నేరమని, పర్మిషన్ లేవని తెలిస్తే భారీ జరిమానాతో పాటు నాన్ బెయిలబుల్ వారెంట్ కింద మూడేళ్ల శిక్ష కూడా పడే అవకాశముంది.