NewsNews AlertTelangana

నల్గొండ టీఆర్ఎస్‌లో ముసలం…

Share with

టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా సొంత పార్టీల కౌన్సిలర్లు తిరుగుబావుటా ఎగురవేస్తున్నారు. ఎమ్మెల్యే, మున్సిపల్ ఛైర్మన్, అధికారుల తీరును ఎండగడుతున్నారు. పలు జిల్లాల్లో జరుగుతున్న మున్సిపల్ సమావేశాలు రసాభాసాగా జరుగుతున్నాయి. అభివృద్ధి జరగడం లేదని, నిధులు కేటాయించడం లేదంటూ నేతలు ఫైర్ అవుతున్నారు. పట్టణంలోని వార్డుల అభివృద్ధిని పట్టించుకోకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్న మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి తీరుకు నిరసనగా కౌన్సిల్ సమావేశం బాయ్ కాట్ చేస్తుండడంతో అధికార పార్టీ పని తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మున్సిపల్ కమిషనర్‌ ఒంటెద్దు పోకడలతో పాటు తమ సమస్యలను ఛైర్మన్‌ పట్టించుకోవడం లేదని కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు. ”కమిషనర్‌ ఇప్పుడుంటారు,వెళ్లిపోతారు… మేం ఇక్కడే ఉండి ప్రజలకు సమాధానం చెప్పాలి. ఇప్పుడు పట్టణాన్ని అభివృద్ధి చేస్తున్నామని చెప్పి కమిషనర్‌ అవినీతికి పాల్పడుతున్నారు.. అంటూ కౌన్సిలర్లు మండిపడుతున్నారు. శనివారం జరిగే మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి 20 మంది కౌన్సిలర్లు హాజరు కావొద్దని నిర్ణయం తీసుకోవడంతో జిల్లాలో చర్చనీయాంశమైంది.

ఈరోజు జరిగే మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే.. అధికార పార్టీకి చెందిన ఈ సమావేశానికి హాజరు కావొద్దని 20 మంది కౌన్సిలర్లు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు నాగార్జున సాగర్ లో రహస్య భేటీ అయ్యారు. ఈ రహస్య భేటీలో మొత్తం 14 మంది కౌన్సిలర్లు ఉన్నారని సమాచారం. నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి వైఖరిపై వాళ్లు అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. పట్టణ అభివృద్ధిలో కనీసం కౌన్సిలర్లకు సమాచారం లేకుండా పనులు చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. ఏకపక్ష నిర్ణయాలను వ్యతిరేకిస్తూ తిరుగుబాటు చేస్తున్నారు. మున్సిపల్ కౌన్సిల్ ఏర్పడి మూడేళ్లు గడుస్తున్నా కనీసం నిధులు కేటాయించడం లేదంటూ ఆరోపిస్తున్నారు. అధికార పార్టీ కౌన్సిలర్ గా ఉన్న వార్డులో అభివృద్ధి శూన్యం అంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఈరోజు జరిగే మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఏమి జరుగుతుందో చూడాలి.