పెట్రోల్ ధరలను 5 రెట్ల పెంచిన క్యూబా సర్కార్
ఇప్పటికే ద్రవ్యోల్బణం, ఉత్పత్తుల కొరత కారణంగా, ఇంధన ధరలో కొత్త 500 శాతం, అంటే 5 రెట్లు పెంచేస్తోంది క్యూబా. కమ్యూనిస్ట్ క్యూబా ఇప్పుడు దేశాన్ని చక్కదిద్దేందుకు చమురు, విద్యుత్ పొదుపు మంత్రాన్ని జపిస్తోంది. నగదు నిల్వలు తగినంత లేనందున… ప్రభుత్వం బడ్జెట్ లోటును తగ్గించుకోవాలని చూస్తోంది. ఫిబ్రవరి 1 నుండి అమల్లోకి వచ్చేలా చమురు ధరలను సోమవారం ఐదు రెట్లు పెంచుతున్నట్టు పేర్కొంది. లీటరు సాధారణ గ్యాసోలిన్ ధర 25 పెసోల నుండి 132 పెసోలకు పెరుగుతుందని, ప్రీమియం గ్యాసోలిన్ ధర 30 నుండి 156 పెసోలకు పెరుగుతుందని వెల్లడించింది.

ధరలు ఒక్కసారిగా పెరగడంతో ఏం చేయాలో అర్థం కాక క్యూబన్లు తలలుపట్టుకుంటున్నారు. ఇప్పటికే ద్రవ్యోల్బణం, ఉత్పత్తి కొరత కారణంగా, ఇంధన ధరలో కొత్త 500% పెరుగుదలను ఎలా ఎదుర్కోవాలో చాలా మంది క్యూబన్‌లకు అర్థం కావడం లేదు. తాజా పెంపుతో, మోటార్‌బైక్ కోసం పది లీటర్ల ఇంధనాన్ని కొనడానికి, నెలవారీ జీతంలో సగానికి పైగా 21 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వ యాజమాన్యంలోని కంపెనీలు, ప్రైవేట్ చమురు కంపెనీలు హోల్ సేల్ ధర 50% పెరుగుతుందని రవాణా మంత్రి ఎడ్వర్డో రోడ్రిగ్జ్ మంగళవారం తెలిపారు. ప్రజా రవాణా ఛార్జీలు “వాటి ప్రస్తుత ధరలను” కొనసాగిస్తాయని… దేశీయ విమానయాన టిక్కెట్లు, ఇంటర్-ప్రావిన్స్ బస్ ఛార్జీలలో భారీ పెరుగుదల ఉంటుందన్నారు. అధికారిక అంచనాల ప్రకారం, క్యూబా ఆర్థిక వ్యవస్థ 2023లో రెండు శాతం తగ్గిపోగా, 2023లో ద్రవ్యోల్బణం 30 శాతానికి చేరుకుంది. ఇది తక్కువ అంచనా అని స్వతంత్ర నిపుణులు అంటున్నారు. కరోనా మహమ్మారి కల్లోలం తర్వాత, అమెరికా క్యూబాపై ఆంక్షలు విధించడంతో ఆ దేశం ఇప్పుడు బెంబేలెత్తుతోంది. ఆర్థిక వ్యవస్థ బలహీనతలతో కోటి పది లక్షల జనాభా ఉన్న క్యూబా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.

అన్ని నిత్యావసర వస్తువులు, సేవలకు సబ్సిడీ ఇస్తున్న క్యూబా ప్రభుత్వం, ఇంధన ధరలను పెంచాల్సి ఉంటుందని గత నెలలో ఇప్పటికే తెలిపింది. ఇప్పటి వరకు, ప్రపంచంలోనే అత్యంత చౌకైన ఇంధనం అందిస్తున్నామని, ఇకపై అది సాధ్యం కాదని ఆ దేశ ఆర్థిక మంత్రి అలెజాండ్రో గిల్ అన్నారు. వినియోగదారులకు అందించే విద్యుత్ 25 శాతం పెంచుతున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. గ్యాస్ ధరల కూడా పెంచుతున్నట్టు ప్రభుత్వం ధృవీకరించింది. చాలా మంది క్యూబన్లు ఇప్పుడు మరింత దారుణమైన ద్రవ్యోల్బణానికి భయపడుతున్నారు. సాధారణ ప్రజలు ధరలు పెరుగుతాయని ఆందోళన చెందుతున్నారు. ఇంధనం, కారు విడిభాగాల కొరత కారణంగా ప్రజా రవాణా ఇప్పటికే పరిమితం చేయబడిన దేశంలో ట్రిప్ ధరలపై ప్రభావం చూపుతుందని భయపడుతున్నానని చెప్పారు.

