ఏపీలో దళితులపై దాడులు ఆందోళనకరం
తిరుపతి:ఆంధ్రప్రదేశ్‌లో దళితులపై దాడులు, అణచివేత చర్యలు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయనే అంశం ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. రాష్ట్రంలో నెలకొన్న ఈ దారుణ పరిస్థితులపై జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు రామచందర్ పత్రికా ముఖంగా సోమవారం తీవ్రంగా స్పందించారు. ముఖ్యంగా తెనాలిలో దళితుడిపై పోలీసులు పాశవికంగా దాడి చేసిన ఉదంతాన్ని కమిషన్ అత్యంత తీవ్రంగా పరిగణించిందని, ఈ ఘటనను సుమోటోగా స్వీకరించి కేసు నమోదు చేసినట్లు ఆయన ప్రకటించారు. రాష్ట్రంలో దళితుల భద్రత ప్రశ్నార్థకంగా మారుతోందని, బాధితులకు న్యాయం జరిగే వరకు కమిషన్ నిశితంగా పర్యవేక్షిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
ఈ పరిణామాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మద్దిల గురుమూర్తి స్పందిస్తూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో దళితుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందని మండిపడ్డారు. జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడే స్వయంగా సీరియస్‌గా స్పందించడం చూస్తుంటే, క్షేత్రస్థాయిలో అణచివేత ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. దళితులపై దాడులు చేయడమే కాకుండా, తిరిగి వారిపైనే అక్రమ కేసులు బనాయించి జైల్లో వేయడం ద్వారా ప్రభుత్వం వారి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
దళితులపై జరుగుతున్న వరుస దాడులను ఎంపీ గురుమూర్తి ఈ సందర్భంగా గుర్తు చేశారు. చుండూరు, కారంచేడు వంటి చారిత్రక ఘటనల తరహాలోనే ప్రస్తుతం తెనాలి, చీరాల వంటి ప్రాంతాల్లో దళితులపై పాశవిక దాడులు జరుగుతున్నాయని విమర్శించారు. తమ నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో వైసీపీ బాధితులకు అండగా ఉంటుందని, జాతీయ స్థాయిలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ , మహిళా కమిషన్లతో పాటు మానవ హక్కుల కమిషన్ దృష్టికి రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అన్యాయాన్ని తీసుకెళ్తామని ఆయన స్పష్టం చేశారు.
రాష్ట్రంలో దళితుల భూములను బలవంతంగా లాక్కోవడం వంటి అంశాలపై మొత్తం 86 కేసులు నమోదయ్యాయని, ఈ విషయంలో కూడా ఎస్సీ కమిషన్ విచారణ జరుపుతోందని గురుమూర్తి వెల్లడించారు. ముఖ్యంగా అమరావతి ప్రాంతంలో దళితుల భూముల లాగోవేత, కౌలు చెల్లింపుల్లో జాప్యం వంటి అంశాలపై ఎస్సీ కమిషన్ వద్ద కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్న వాస్తవం రాష్ట్రంలోని దారుణ పరిస్థితులకు అద్దం పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. దళితులపై దాడులకు పాల్పడుతున్న వారిపై మరియు అక్రమ కేసులతో వేధిస్తున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన జాతీయ ఎస్సీ కమిషన్‌ను , కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

