accidentHome Page Sliderhome page sliderInternationalNationalNewsNews Alerttelangana,Trending Todayviral

విమానం అందుకే కూలిపోయింది.

ఎయిర్ ఇండియాకు చెందిన విమానం జూన్ 12వ తేదీన ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళుతున్న విమానం టేకాఫ్ అయిన కొన్ని సెకన్లకే కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదం జరిగి ఈ రోజుతో సరిగ్గా నెల రోజులు అయింది. ఈ నేపథ్యంలోనే ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) ప్రమాదంపై ప్రాథమిక దర్యాప్తుకు సంబంధించిన నివేదికను విడుదల చేసింది. శనివారం విడుదలైన ప్రాథమిక నివేదికలో సంచలన విషయాలు వెలుగు చూశాయి.
ప్రమాద సమయంలో పైలట్ల మధ్య జరిగిన సంభాషణ కాక్‌పిట్‌లో ఉన్న రికార్డర్‌లో బయటపడింది. ఆ సంభాషణను బట్టి చూస్తే.. విమానం టేకాఫ్ అయిన కొన్ని క్షణాలకే విమానానికి ఇంధన సరఫరా ఆగిపోయింది. ఓ పైలట్ దానిపై స్పందిస్తూ..‘ఎందుకు ఆపు చేశావు?’ అని అని అడిగాడు. మరొక పైలట్ తానలా చేయలేదని చెప్పాడు. ఇంధన సరఫరా ఆగిపోయిన కొన్ని క్షణాలకే ఓ పైలట్ మేడే అలర్ట్ ఇచ్చాడు.
ఈ నేపథ్యంలోనే ‘ది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్’ ఆ మేడే ఎందుకు ఇచ్చారో తెలుసుకోవడానికి ప్రయత్నించింది. అయితే, పైలట్ల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. కొద్దిసేపటికే ఎయిర్ పోర్టు సరిహద్దుల బయట విమానం కుప్పకూలింది. కాలేజీ హాస్టల్ భవనంపై పడిపోయింది. విమానంలో పూర్తి స్థాయిలో ఇంధన నిల్వలు ఉండటంతో మంటలు భారీ స్థాయిలో ఎగిసిపడ్డాయి. విమానంలోని వారు, కాలేజీ హాస్టల్‌లోని విద్యార్థులు, నేలపై ఉన్నవారు కూడా కాలి బూడిదయ్యారు. పైలట్ పొరపాటున విమానానికి ఇంధన సరఫరా ఆపేశాడా? లేక దానంతట అదే ఆగిపోయిందా? అన్నది తెలియాల్సి ఉంది.