‘అందుకే 8వ స్థానంలో వస్తున్నా’..ధోనీ క్లారిటీ.
ఐపీఎల్ మ్యాచ్‌లలో ధోనీ 8వ స్థానంలో వస్తుండడంతో అభిమానులు నిరాశకు గురవుతున్నారు. నిన్నటి ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే ఓటమి పాలు కాబోతున్నదని ముందే ఊహించినప్పటికీ ధోనీని చివర్లోనే బ్యాటింగుకు పంపడంతో సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాలపై గతంలోనే ధోనీ కారణాలు చెప్పి క్లారిటీ ఇచ్చాడని వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ధోనీ చెప్పిన కారణం ఏమిటంటే.. కొన్ని మ్యాచ్‌లలో ఓడిపోయినా సరే కుర్రాళ్లకు అవకాశాలు ఇవ్వడం ముఖ్యమని ధోనీ అభిప్రాయపడ్డారు. “గత టీ20 ప్రపంచకప్ ముందు ఐపీఎల్ సీజన్‌లో కూడా ఇలాగే జరిగింది. ఐపీఎల్‌లో రాణించిన ఆటగాళ్లకు టీ20లో అవకాశాలు దక్కే అవకాశాలు ఎక్కువ. సీఎస్కే నుండి రవీంద్ర జడేజా, శివమ్ దుబె పోటీలో ఉన్నారు. వారికి అవకాశాలు ఇవ్వాలి. నేను జాతీయ జట్టు సెలక్షన్‌లో లేను. మా ఫ్రాంచైజీ ప్లేయర్ల అవకాశాలను దూరం చేయదు. మా ఆటగాళ్లను ప్రమోట్ చేయగానికే ప్రయత్నిస్తాం. యువ ఆటగాళ్లు బాగా ఆడుతూ నాపై ఒత్తిడి తగ్గిస్తున్నారు”. అంటూ వ్యాఖ్యానించారు. సీఎస్కే ప్లేయర్లను మానసికంగా సిద్దం చేసేందుకే ధోనీ, సీఎస్కే మేనేజ్‌మెంట్ కలిసి ఇలాంటి ప్రణాళికలు రూపొందిస్తోందని మాజీ క్రికెటర్లు పేర్కొంటున్నారు. అయితే బెంగళూరు మ్యాచ్‌లో సీఎస్కే కష్టాల్లో ఉన్నప్పుడైనా ధోనీని ముందుగా పంపించి ఉంటే బాగుండేదని అభిమానులు వాపోతున్నారు.

