జమ్మూలో ఉగ్రవాదులు, భారత్ నిఘా వర్గాలు హెచ్చరిక
జమ్మూ కశ్మీర్ ప్రాంతంలో 30 మందికి పైగా పాకిస్థానీ ఉగ్రవాదులు నక్కినట్లు ఆదివారం భారత నిఘా వర్గాలు పేర్కొనడంతో, బీఎస్‌ఎఫ్ భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఉగ్ర స్థావరాలు గుర్తించడానికి భద్రతా దళాలు కొండలు, అడవులు, మారుమూల లోయల్లో గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ఉగ్ర స్థావరాలను ట్రాక్ చేయడానికి డ్రోన్లు, థర్మల్ ఇమేజర్లు, గ్రౌండ్ సెన్సార్లను మోహరించినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. చలి తీవ్రత కఠినంగా ఉండే ఈ సమయంలో, అడవులు మంచుతో నిండిన ఎత్తైన ప్రాంతాల్లో పాకిస్థాన్ ఉగ్రవాదులు తలదాచుకుంటున్నట్లు భారత నిఘా వర్గాలు గుర్తించాయి. జమ్మూలో ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోవడంతో ఉగ్రవాదులపై నిరంతర నిఘా కోసం పర్వత ప్రాంతాల్లో తాత్కాలిక నిఘా స్థావరాలు ఏర్పాటు చేస్తున్నట్లు భద్రతా ఉన్నతాధికారులు తెలిపారు.
జమ్మూలో మంచు కురుస్తోండడంతో చొరబాట్లకు ఇదే అదునుగా భావించిన, పాక్ ఉగ్రమూకలు అంతర్జాతీయ సరిహద్దును దాటుకుని భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయని సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్) అధికారులు వెల్లడించారు. అయితే ఆ ప్రయత్నాలను తమ దళాలు తిప్పికొడుతున్నాయన్నారు. సరిహద్దుల్లో ఉగ్ర కదలికల నేపథ్యంలో, కశ్మీర్‌లోని గుల్మార్గ్, సోనామార్గ్ దాల్ లేక్ ప్రాంతాలతో సహా పలు సున్నితమైన ప్రదేశాల్లో భద్రతా దళాలు, స్థానిక పోలీసులు ప్రత్యేక బృందాలను మోహరించాయన్నారు. ఈ హెచ్చరికలతో భారత సైన్యం కిష్త్వార్, దోడా జిల్లాల్లో ఉగ్రవాద వ్యతిరేక చర్యలను ముమ్మరం చేసింది. మైనస్ డిగ్రీల చలిలో కూడా సైన్యం తాత్కాలిక నిఘా కేంద్రాలను ఏర్పాటు చేసి ముఖ్యమైన ప్రభుత్వ కట్టడాల వద్ద నిఘాను కట్టుదిట్టం చేశారు. సరిహద్దుల గుండా చొరబాట్లు జరగకుండా నిరంతరం నిఘా కొనసాగుతుందని బీఎస్ఎఫ్ ఉన్నతాధికారులు వెల్లడించారు.

