Andhra PradeshNationalTelangana

కడుపుకోతల్లో తెలుగురాష్ట్రాలదే అగ్రస్థానం

మాతృత్వం ఏతల్లికైనా ఒక అందమైన మరువలేని అనుభవం. పొత్తిళ్లలోని చిట్టి పుత్తడిబొమ్మలాంటి తన పాపాయిని చూసుకుని మురిసిపోయే మధుర క్షణం. అలాంటి అనుభూతులకు స్త్రీలను దూరం చేస్తున్నాయి మన కార్పొరేట్ ఆసుపత్రులు. పైసలే పరమావధిగా, అడ్డగోలుగా సిజేరియన్లు చేసేస్తున్నాయ్. ఈ కడుపుకోతలు కారణంగా పుట్టిన కొన్ని గంటల వరకూ తల్లులు, బిడ్డలు దూరమవుతున్నారు. బిడ్డలకు పుట్టిన వెంటనే ఎంతో రోగనిరోధకశక్తిని ఇచ్చే మొదటి తల్లిపాలకు దూరమవుతున్నారు. ఆపరేషన్ కారణంగా తల్లులకు శక్తి సన్నగిల్లి, బిడ్డను ఎత్తుకొని, ముద్దాడలేని దుస్థితి వస్తోంది.

వైద్య ఆరోగ్యశాఖ తాజా లెక్కల ప్రకారం రాష్ట్రంలో ప్రస్తుతం 57శాతం సిజేరియన్లు జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కడుపుకోతలు సగటున 21 శాతం ఉండగా, భారత్‌లో మాత్రమే 22 శాతం ఉంది. ఇక ఇది 2030 నాటికి 30శాతం దాటిపోతుందని ప్రపంచ ఆరోగ్యసంస్థ చెపుతోంది. కానీ నిజానికి తెలంగాణా రాష్ట్రం సిజేరియన్ ప్రసవాలలో దేశంలోనే అగ్రగామిగా ఉంది. తర్వాత స్థానాల్లో ఏపీదే అగ్రస్థానం 40శాతంతో తెలుగు రాష్ట్రాలు ముందజలో ఉన్నాయి. మహారాష్ట్రలో 20శాతం, కర్ణాటకలో 23 శాతం సిజేరియన్ కాన్పులు జరుగుతున్నాయి.

మన రాష్ట్రంలో గత ఏడాది ఆగస్టులో ప్రభుత్వ ఆస్పత్రుల్లో 47శాతం సిజేరియన్లు జరిగితే ప్రస్తుతం అది 45శాతానికి కాస్త తగ్గింది. ఇక ప్రవేట్ ఆస్పత్రుల్లో ఏకంగా 80 శాతం కడుపుకోతలే. సుమారుగా గంటకు 28 చొప్పున సిజేరియన్ ఆపరేషన్లు జరుగుతున్నాయి.

ప్రవేటు ఆసుపత్రులు కూడా ప్రజల బలహీనతను సొమ్ము చేసుకుంటున్నాయి. ఎలా అంటే చాలామంది దంపతులు మంచిరోజులు, సమయాలు చూసుకుంటూ ఆటైంకే ఆపరేషన్లు చేయిస్తున్నారు. ఇంకొందరు నొప్పులు భరించలేమనే భయంతో కూడా ఆపరేషన్లకు మొగ్గు చూపుతున్నారు.

సాధారణంగా శిశువుకు హార్ట్ రేట్ పెరిగినప్పుడు, ఉమ్మనీరు చేరినప్పుడు, స్త్రీలకు ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడే ఆపరేషన్లు చేయాలి. కానీ డాక్టర్లు ఫీజుల కోసం,  పేషెంట్లు ఇతర కారణాలతో ఈ ప్రమాణాలు పాటించడం లేదు.

ఈ మధ్య ప్రభుత్వ, ప్రవేట్ ఆస్పత్రులలో సిజేరియన్‌లపై ప్రత్యేక అడిట్‌ను చేయాలని ప్రభుత్వం ఉత్తర్యులు జారీ చేసింది. అనవసర ఆపరేషన్లు జరిగితే కఠిన చర్యలుంటాయని హెచ్చరించింది. జిల్లాలలో కడుపుకోతలపై DMHO అధ్వర్యంలో కమిటీలు ఏర్పాటుచేసి, ఆస్పత్రులలో తనిఖీలు చేసే అధికారాలను ఇచ్చారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ కాన్పులను పెంచేందుకు 3వేలరూపాయలు ప్రోత్సాహకాలు ప్రకటించింది. సిజేరియన్లు పెరగడానికి ఫీజులు కూడా ఒక కారణం. ప్రవేట్ ఆసుపత్రులలో సాధారణ కాన్పుకు 20 వేలు, సిజేరియన్‌కు 40 నుండి 50 వేలు వసూలు చేస్తారు. అందుకే డాక్టర్లు సిజేరియన్లు చేసేస్తున్నారు. ఈమధ్య కాలంలో  మహిళలు తమ ఆరోగ్యంపై కూడా సరిగా శ్రద్ధ చూపడం లేదు. 30 ఏళ్లలోపే ఊబకాయం, థైరాయిడ్, బీపీ, మధుమేహం వంటి రోగాల బారిన పడుతున్నారు. అందువల్ల అలాంటి వారికి సహజ ప్రసవాలు కావడం కష్టమనే అంటున్నారు డాక్టర్లు.