NewsTelangana

కేసీఆర్ సర్కారుకు హైకోర్టు మొట్టికాయలు
జమున హేచరీస్ కేసులో కోర్టు కీలక వ్యాఖ్యలు

Share with

నిజాయితీ… నిబద్ధత ముందు దొర ఆటలు సాగవు… ధర్మం ముందు అధర్మం ఎన్నడూ విజయం సాధించదు… ఈటల కుటుంబానికి చెందిన జమునా హేచరీస్‌కు సంబంధించి కేసీఆర్ సర్కారు ఆడుతున్న దొంగనాటకం ఎన్నోసార్లు బహిర్గతమయ్యింది. కోర్టు మొట్టికాయలు వేసినా దొర తీరు మాత్రం మారడం లేదు. అనవసరంగా బద్నాం చేసి… ప్రజల్లో పలుచన చేయాలన్న కుట్రకు తెరదీస్తోంది కేసీఆర్ సర్కారు. అందుకు అధికార యంత్రాంగాన్ని ఇష్టారాజ్యంగా వాడేసుకుంటోంది. లేనిది ఉన్నట్టు… ఉన్నది లేనట్టుగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ తీరును హైకోర్టు తప్పుబట్టింది. అసైన్డ్ భూముల వ్యవహారంలో జమునా హేచరీస్‌కి ఎలాంటి సంబంధం లేదని… ప్రభుత్వం ఇచ్చిన నోటీసులను సమాధానం ఇచ్చిన తరువాత కూడా పదే పదే ఈటల కుటుంబాన్ని ఎందుకు బద్నాం చేస్తారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది.

130/A సర్వే నంబర్ లో జమునా హేచరీస్‌కి 3 ఎకరాల పట్టా భూమిని ఎట్టి పరిస్థితుల్లో ముట్టుకోవద్దని హైకోర్టు అధికారులను ఆదేశించింది. ప్రభుత్వ వ్యవహరించిన తీరు సహజన్యాయ సూత్రాలకు విరుద్ధంగానే ఉందని… పట్టాల పంపిణీ అంటూ ప్రభుత్వం తొందరపాటుగా వ్యవహరించిందని అక్షింతలు వేసింది. మొదట్నుంచి ఈటల రాజేందర్ సతీమణి… ఈటల జమున చేస్తున్న వాదనకు… కోర్టు తాజా వ్యాఖ్యలు బలాన్నిచ్చాయ్. తాజాగా హైకోర్టులో ఈటల కుటుంబానికి భారీ ఊరట లభించింది. జమునా హేచరీస్ భూమి విషయంలో ప్రభుత్వం ఎలాంటి జోక్యం చేసుకోడానికి వీళ్లేదని మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. మెదక్ జిల్లా ముసాయిపేట మండలం అచ్చంపేట్ గ్రామంలోని సర్వే నెంబర్ 130లో జమునా హేచరీస్ మూడెకరాల భూమి విషయంలో ఆగస్టు 1 వరకు ఎలాంటి జోక్యం చేసుకోవద్దని హైకోర్టు స్పష్టం చేసింది.

ఇందుకు సంబంధించి రెవిన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి,మెదక్ కలెక్టర్, స్థానిక ఆర్డీవో, ముసాయిపేట తహసీల్దార్‌కు జస్టిస్ ఎం సుధీర్ కుమార్ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. జమునా హేచరీస్ ఆధీనంలో ఉన్న మూడెకరాలు ప్రభుత్వ భూమి అని… ఆక్రమించినందుకు వివరణ ఇవ్వాలని గత నెల 25న ముసాయిపేట తహసీల్దార్ నోటీసులు జారీ చేశారు. ఇదే విషయాన్ని సవాల్ చేస్తూ.. ఈటల నితిన్, ఈటల జమున హైకోర్టును ఆశ్రయించారు. ఈటల తరపున మాజీ అడ్వొకేట్ జనరల్ దేశాయి ప్రకాష్ రెడ్డి వాదనలు విన్పించారు. ఇది వరకే కలెక్టర్ ప్రాధమికంగా సర్వే పూర్తి చేశారని… పూర్తి స్థాయి సర్వే కొనసాగుతుందని తెలిపారు. సర్వే పూర్తిగా చేయకుండానే… భూములు ఆక్రమణకు గురయ్యాయని…ప్రభుత్వం ఎలా నిర్ధారిస్తోందని ఈటల న్యాయవాది కోర్టుకు వివరించారు. ఇరువురి వాదనలు విన్న హైకోర్టు… ఆగస్టు 1 వరకు ఎలాంటి జోక్యం చేసుకోవద్దన్న కోర్టు… కేసును ఈనెల 25కి వాయిదా వేసింది.