విద్యార్థినితో ప్రేమ కోసం టీచర్ లింగ మార్పిడి
ప్రేమ కోసం ఎందరో ఎన్నో త్యాగాలు చేసిన ఘటనలు చూశాం. రాజస్థాన్‌లో మాత్రం స్టూడెంట్‌ను ప్రేమించిన ఓ యువతి ఏకంగా లింగ మార్పిడి చేసుకున్న సంఘటన సంచలనమైంది. భరత్‌పూర్‌కు చెందిన మీరా కుంతల్ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో పీఈటీ టీచర్‌గా పని చేస్తోంది. అదే స్కూల్లో చదువుతున్న కల్పన అనే అమ్మాయి మీరా వద్ద కబడ్డీ కోచింగ్ తీసుకుంటోంది. శిక్షణ ఇచ్చే క్రమంలో కల్పనతో మీరా లవ్‌లో పడింది. వీరిద్దరి మధ్య 2016లో అయిన పరిచయం 2018 నాటికి ప్రేమగా మారింది. కల్పనను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న మీరా ఏకంగా లింగ మార్పిడి చేయించుకుంది. 2019లో తొలిసారి లింగ మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకున్న మీరా 2021లో చివరి సర్జరీ చేయించుకొని తన పేరును ఆరవ్ కుంతల్‌గా మార్చుకుంది. ఇరువురి కుటుంబ సభ్యులు అంగీకరించడంతో రెండు రోజుల క్రితం ఆరవ్, కల్పన పెళ్లి చేసుకున్నారు.

ప్రేమలో ఏం చేసినా కరెక్టే..
తనకు నలుగురు అక్కలు అని చెప్పిన ఆరవ్ అలియాస్ మీరా ఇంట్లో చిన్నదాన్ని కావడంతో చిన్నప్పటి నుంచీ అబ్బాయిగానే ఉండాలనుకునేదాన్ని అని చెప్పింది. ఇంట్లో వాళ్లు కూడా తనను అబ్బాయిగా చూసి మురిసిపోయేవారని తెలిపింది. మీరా అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పిన కల్పన.. ఆమె లింగ మార్పిడి చేయించుకోకున్నా ఆమెనే పెళ్లి చేసుకునే దాన్నని చెప్పింది. రాష్ట్ర స్థాయి కబడ్జీ క్రీడాకారిణి అయిన కల్పన అంతర్జాతీయ కబడ్డీ టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు వచ్చే ఏడాది జనవరిలో దుబాయ్ వెళ్లేందుకు సిద్ధమవుతోంది. ప్రేమలో ఏం చేసినా కరెక్టే అని ఆరవ్ చెప్పాడు.

