InternationalNews

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తానా బోర్డు డైరెక్టర్‌ భార్య, ఇద్దరు కూతుళ్లు మృతి

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) బోర్డు డైరెక్టర్‌ డాక్టర్‌ కొడాలి నాగేంద్ర శ్రీనివాస్‌ భార్య, ఆయన ఇద్దరు కుమార్తెలు దుర్మరణం చెందారు. దసరా పండుగ సందర్భంగా హ్యూస్టన్‌లో కాలేజీ నుంచి తన ఇద్దరు కుమార్తెలను తీసుకొని ఇంటికి వస్తుండగా వాళ్ల కారును ఓ వ్యాను ఢీ కొట్టింది. వాళ్లు టెక్సాస్‌ వాలర్‌ కౌంటీలో వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కృష్ణా జిల్లా పామర్రు మండలం కురుమద్దాలి గ్రామానికి చెందిన నాగేంద్ర శ్రీనివాస్‌ గుంటూరు వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌ పూర్తి చేసి 1995లో అమెరికా వెళ్లారు. హ్యూస్టన్‌లో ఉన్నత విద్యను పూర్తి చేసి అక్కడే పీడియాట్రిక్‌ కార్డియోవాస్కలరో అనస్థీషియాలజిస్టుగా స్థిరపడ్డారు.

నాగేంద్ర భార్య వాణి ఐటీ ఉద్యోగి..

నాగేంద్ర 2017 నుంచి తానా బోర్డులో డైరెక్టరుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన భార్య వాణి ఐటీ ఉద్యోగి. పెద్ద కుమార్తె వైద్య విద్యను, రెండో కుమార్తె 11వ తరగతి చదువుతున్నారు. ఘటనా స్థలంలోనే ఇద్దరు చనిపోగా.. మరొకరు ఆస్పత్రిలో మృతి చెందారు. రోడ్డు ప్రమాదంలో భార్య, ఇద్దరు కుమార్తెలు చనిపోయారన్న వార్త విన్న నాగేంద్ర షాక్‌లోకి వెళ్లిపోయారు. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన తానా సభ్యులు, సన్నిహితులు మిగిలిన కార్యక్రమాలు పూర్తి చేసే పనుల్లో బిజీ అయ్యారు. నాగేంద్ర తండ్రి కొడాలి రామ్మోహన్‌ రావు ప్రభుత్వ ఉద్యోగం నుంచి రిటైర్మెంట్‌ తీసుకొని విజయవాడలో స్థిరపడ్డారు.