Home Page SliderNational

ఈడీ చీఫ్ పదవీ కాలం పెంపుకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్

ఈడీ చీఫ్ సంజయ్ కుమార్ మిశ్రా పదవీకాలాన్ని పొడిగించాలంటూ అభ్యర్థించిన కేంద్రం కోరికను మన్నించింది సుప్రీం కోర్టు. సెప్టెంబర్ 15 వరకూ ఆయన బాధ్యతలలో కొనసాగేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సంజయ్ మిశ్రా ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ సమీక్షలో కీలక వ్యక్తిగా ఉన్నారని, ఆయన ఆ పదవిలో కొనసాగడం ప్రజాప్రయోజనాల దృష్ట్యా అవసరమని కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును కోరింది. అక్టోబర్ 15 వరకూ ఆయన పదవీ కాలం పొడిగించమంటూ కేంద్రం కోరినా అంత వరకూ సుప్రీం కోర్టు అంగీకరించలేదు. సెప్టెంబరు 15 వరకూ మాత్రమే ఆయన పదవిలో ఉంటారని, ఆపై ఎట్టి పరిస్థితులలోనూ తప్పుకోవాల్సిందేనని తేల్చి చెప్పింది. జస్టిస్ బిఆర్ గవై, విక్రమ్ నాథ్, సంజయ్ కరోల్ సభ్యులుగా ఉన్న త్రిసభ్య కమిటీ ఈ ఆదేశాలను జారీ చేసింది. ఆయన పదవీ కాలాన్ని ఇప్పటికే మూడు సార్లకు పైగా పొడిగించిన సంగతి తెలిసిందే.