“పెద్దయ్యావు, నిన్ను పోషించలేము పెళ్లి చేసుకో”- వైరల్ అయిన స్టూడెంట్ ఆన్సర్
మనసర్కార్
మనుషులందరూ ఒకేలా ఉండరు. వారివారి మనస్తత్వాన్ని బట్టి, వారు చూసిన సంఘటనలు బట్టి వారి అభిప్రాయాలు ఒకరికొకరికి భిన్నంగా ఉంటాయి. ఇక చిన్న పిల్లల విషయానికి వస్తే, వారి దృక్కోణం వేరే రకంగా ఉంటుంది. వారు పెద్దలు చెప్పిన విషయాలను బట్టి, వారు అర్థం చేసుకున్న విధానాన్ని బట్టి ప్రవర్తిస్తుంటారు. వారు అమాయకంగా అడిగే ప్రశ్నలు, వారు చెప్పే సమాధానాలు ఒక్కొక్కసారి విచిత్రంగా ఉంటాయి. కొన్ని చాలా నవ్వు తెప్పిస్తాయి.
ఇలాంటి ఒక సమాధానం రాసిన స్టూడెంట్ పేపర్ ట్విటర్‌లో చాలా వైరల్ అయ్యింది. అదేంటంటే సోషల్ ఎగ్జామ్‌లో వివాహం గురించి నిర్వచనం రాయమని ఉన్న ప్రశ్నకు ఆ పిల్లవాడు రాసిన సమాధానం ఇది. అమ్మాయి తల్లిదండ్రులు తమ కుమార్తె పెద్దదయ్యిందని, ఇక తాము పోషించలేమని అనుకుని,నిన్ను పోషించగలిగే అబ్బాయిని చూసుకో అని చెప్పి పెళ్లి చేస్తారని సమాధానం రాసాడు. పైగా అబ్బాయి తల్లిదండ్రులు కూడా తమ అబ్బాయి పెద్దవాడయ్యాడని ఇంక పెళ్లి చేసుకో అంటూ అరుస్తారని కూడా రాశాడు. తర్వాత వివాహం చేసుకునే అమ్మాయి, అబ్బాయి మాట్లాడుకుని, ఒక ఒప్పందానికి వచ్చి కలిసి నివసించడానికి, పిల్లలను కనడానికి వివాహం చేసుకుంటారని తన ఆన్సర్‌లో రాశాడు.
ఈ సమాధానం చదివిన టీచర్‌కు చిర్రెత్తుకొచ్చినట్లుంది. ఆ సమాధానాన్ని అడ్డంగా కొట్టేసి, ‘నాన్‌సెన్స్’ అంటూ రాసి, 0 మార్కులు వేసింది. ఆ స్టూడెంట్‌కి మార్కులు పడకపోయినా, సోషల్ మీడియాలో వేలు అనే వ్యక్తి చేసిన పోస్టు వలన ట్వీట్లు వెల్లువెత్తాయి. ఎంతోమంది దాన్ని రీట్వీట్ చేశారు. ఈ పోస్టుకు 11.7 వేల లైకులు, 2000 రీట్వీట్లు వచ్చాయి. ఒకరు దీనికి కామెంట్ రాస్తూ పెళ్లికి నిజమైన నిర్వచనం ఇదే అంటూ మెచ్చుకున్నారు. మరొకరు దీనిపై స్పందిస్తూ ఆ అబ్బాయి చాలా నిజమే చెప్పాడంటూ నవ్వుకున్నారు. ఆ సమాధానంలోని ‘You are a big woman now, we can’t feed you again” అనే మాటలు తన తల్లిదండ్రులు కూడా తనతో చెప్పినవే అని కొందరు అన్నారు.

