NationalNews

లోక్‌సభలో పచ్చి వంకాయతో ఎంపీ రచ్చ రంబోలా..!

Share with

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో విపక్షాల ఆందోళనలు, వాయిదా పర్వం తర్వాత లోక్‌సభలో చర్చ మొదలైంది. ధరల పెరుగుదలపై అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాడీవేడి చర్చ కొనసాగుతోంది. ఈ సందర్భంగా దిగువ సభలో ధరల పెరుగుదలపై జరిగిన చర్చల్లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కకోలీ ఘోష్ దస్తీదార్ వంటగ్యాస్ ధర పెరుగుదలను ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆమె పచ్చి వంకాయను కొరికి చూపించారు. గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెరగడంతో వండుకోవడం కష్టమని చెప్పడానికే ఆమె ఇలా వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు.

స్వల్ప వ్యవధిలో గ్యాస్ సిలిండర్ ధరను నాలుగుసార్లు పెంచారని, ఒకప్పుడు రూ.600 గా ఉన్న సిలిండర్ ఇప్పుడు రూ.1100 దాటిందని ఆమె మండిపడ్డారు. సామాన్యులు వంట చేసుకోవడం భారంగా మారిందని, ప్రజలు పచ్చికూరగాయలు తినాలని ప్రభుత్వం కోరుకుంటోందా? అని ప్రశ్నించారు. తన టేబుల్ పై ఉన్న పచ్చి వంకాయను తీసుకొని కొరికారు. దీంతో సభలోని సభ్యులంతా నవ్వులు చిందించారు. గ్యాస్ ధరను వెంటనే తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పైగా ఉజ్వల పథకం కింద కనెక్షన్లు పొందిన పేద లబ్దిదారులకే ప్రభుత్వం సబ్సిడీని పరిమితం చేయడంతో సామాన్య కుటుంబాలు వంట గ్యాస్‌ కొనుగోలుకు సబ్సిడీ లేని రేట్లు చెల్లిస్తున్నారని కూడా ఈ సందర్భంగా కకోలి ఘోష్‌ చెప్పుకొచ్చారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు మొదలైన రోజే ధరల పెరుగుదల, నిత్యావసరాల, జీఎస్టీ, ధరల పెరుగుదల వంటి అంశాలను లేవనెత్తి సభ్యులు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. దీంతో సభ కార్యకలాపాలు స్తంభించాయి. వాయిదాల పర్వం కూడా నడిచింది. ఈ క్రమంలోనే నలుగురు కాంగ్రెస్ ఎంపీలు సస్పెన్షన్‌కు గురవడం మరింత గందరగోళానికి దారితీసింది. అయితే వారిపై సస్పెన్షన్ ను ప్రభుత్వం ఎత్తివేసింది. విపక్షాలు కూడా ఆందోళనపై వెనక్కి తగ్గడంతో ధరల పెరుగుదలపై చర్చ జరిగింది