NationalNews

డీఎంకే అధ్యక్షుడిగా 4 ఏళ్లు పూర్తి చేసుకున్న స్టాలిన్

తమిళనాడు ముఖ్యమంత్రిగా స్టాలిన్ ఆ రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నారు. దీంతో కేవలం కొన్ని రోజుల్లోనే ఆయన ప్రజా నేతగా పేరుగాంచారు. ముఖ్యమంత్రి స్టాలిన్  ఈ విధంగా ప్రజాభిమానాన్ని పొందుతూ..సేవలందిస్తున్నారు. అయితే స్టాలిన్ 2018 ఆగస్టు 28న డీఎంకే పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఆయన తన రాజకీయ ప్రస్థానంలో డీఎంకే అధ్యక్షుడిగా నిన్నటితో 4 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా డీఎంకే ముఖ్యనేతలు, మాజీ ముఖ్యమంత్రులైన దివంగత అన్నాదురై,కరుణానిధి సమాధుల వద్ద సీఎం స్టాలిన్ నివాళులర్పించారు. అనంతరం అన్నా అరివాలయంలో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొని పార్టీ నాయకులను కలుసుకున్నారు. ఈ నేపథ్యంలో  ఆయనకు పలువురు  పార్టీ నేతలు శుభాకాంక్షలు తెలిపారు.

డీఎంకే పార్టీ అధికారిక దినపత్రిక మురసొలి కార్యాలయంలో సీఎం స్టాలిన్ కరుణానిధి విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సమయంలో సీఎం స్టాలిన్ వెంట పార్టీ ప్రధాన కార్యదర్శి దురైమురుగన్,మంత్రులు ఏవీ వేలు,శేఖర్ బాబు,ముత్తుస్వామి తదితరులు ఉన్నారు.  స్టాలిన్‌కు డీఎంకే ఎంపీ,ఆయన చెల్లెలు కనిమొళి ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రంలో పార్టీ ఔన్నత్యాన్ని కాపాడుతున్నందుకు ప్రజలు ఆయనకు మద్దతు పలుకుతున్నారు. ఇదంతా ఆయన నేతృత్వంలోని పాలనకు నిదర్శనమని ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా స్టాలిన్ తన పార్టీ అధ్యక్షుడ్ని జ్ఞాపకం చేసుకుంటూ ట్విట్టర్ వేదికగా ఇలా రాసుకొచ్చారు. మీ మాట ప్రకారమే నడుస్తున్నాను. అసమాన నాయకుడా,ముఖ్యమంత్రుల్లో ప్రధానుడా,కళారంగం కులపతి, మా ప్రాణమా,మా భావమా,మీరు అధ్యక్షుడిగా వ్యవహరించిన డీఎంకే అధ్యక్షుడిగా పదవిలో ఐదో ఏడాదిలోకి అడుగు పెడుతున్నాను. ప్రతి అడుగు మీరు ఏర్పాటు చేసిన మెట్టుపైనే ఎక్కుతున్నాను .మీ మాట ప్రకారమే నడుస్తున్నాను..కాబట్టే గెలుస్తున్నానని తెలిపారు.