మద్యం మత్తులో కుమారుడి దారుణ హత్య..
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో దారుణం జరిగింది. మద్యం మత్తులో విచక్షణా రహితంగా సొంత కుమారుడి పైనే దాడి చేశాడు తండ్రి. ఆరేగూడేనికి చెందిన సైదులు లారీ డ్రైవర్. అతనికి భార్య నాగమణి, ముగ్గురు కుమారులు ఉన్నారు. మూడవ కుమారుడు భాను ప్రసాద్(14) తొమ్మిదవ తరగతి చదువుతున్నాడు. వారి పాఠశాలలో శనివారం ఫేర్‌వెల్ పార్టీ నిర్వహించగా, అతడు ఆలస్యంగా రాత్రి 8 గంటల వేళ ఇంటికి వచ్చాడు. అప్పటికే మద్యం తాగి, తూలుతున్న సైదులు ఎందుకు ఆలస్యంగా వచ్చావంటూ భాను ప్రసాద్‌ని విపరీతంగా కొట్టాడు. కాలితో గుండెలపై తన్నడంతో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ఆసుపత్రికి తీసుకెళ్లగా బాలుడు అప్పటికే మరణించినట్లు తెలిసింది. పోస్టుమార్టం వద్దని మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చారు. ఆదివారం హడావిడిగా దహన సంస్కారాలు చేయబోతుండగా, సమాచారం తెలిసిన పోలీసులు అక్కడికి చేరుకున్నారు. సైదులును అదుపులోకి తీసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపించారు. తల్లి నాగమణి నుండి ఫిర్యాదు స్వీకరించి, కేసు నమోదు చేశారు.

