Home Page SliderTelangana

తెలంగాణలో భారీగా పెరుగుతున్న సోనా మసూరి బియ్యం ధరలు

వంద కేజీలకు వెయ్యికి పైగా పెరిగిన బియ్యం ధరలు
6 వేలకు చేరువలో క్వింటాల్ బియ్యం
లబోదిబోమంటున్న వినియోగదారులు
మధ్యతరగతిపై మోయలేనంత బియ్యం భారం

తిండి కలిగితే కండ కలదోయ్‌… కండ కలవాడేను మనిషోయ్‌… అంటూ గురజాడ అప్పారావు దేశమును ప్రేమించుమన్న గేయం… ఇప్పటికీ మన చెవుల్లో మార్మోగుతోంది. కానీ తినే తిండి ధరలు అమాంతంగా పెరిగిపోవడంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. ధరల పెరుగుదలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నెపం ఒకరిపై ఒకరు వేసుకుండటంతో, పరిస్థితులు మరింత విషమిస్తున్నాయ్. దేశ వ్యాప్తంగా పప్పులు ధరలు ఆకాశాన్నంటగా, తాజాగా బియ్యం ధరలు మండిపోతున్నాయ్. దశాబ్దకాలంగా పాతిక కేజీలు వెయ్యి రూపాయలకు కొంచెం అటూ ఇటూగా ఉన్న ధరలు ఇప్పుడు తక్కువగా తక్కువ రిటైల్ మార్కెట్లో పదిహేను వందల వరకు పలుకుతుంటే… మిల్లు వద్దే క్వింటా ధర 6 వేలు పలుకుతోంది. అంటే కిలో బియ్యం 60 రూపాయలకు చేరింది. ఈ రేట్లు వచ్చే నెల రోజుల్లో మరింత పెరిగే అవకాశముందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయ్.

క్వింటాల్‌ (వంద కేజీలు) రూ.1,000 పెరిగిన తర్వాత సరాసరి వరి రకాల ధరలు వంద కేజీలు సగటున రూ.6,000కు చేరాయి. క్వింటాల్‌కు రూ.5 వేల నుంచి రూ.6 వేలకు పెరగడంతో సోనా మసూరి బియ్యాన్ని ఉపయోగించే మెజారిటీ ప్రజలు లబోదిబోమంటున్నారు. ఇతర సన్న వరి రకాల ధర కూడా మార్కెట్‌లో క్వింటాల్‌కు రూ.6,500కి చేరడంతో వినియోగదారులు తల్లడిల్లుతున్నారు. సన్న వరి రకాల వరి సాగు విస్తీర్ణం తగ్గిపోవడంతో మార్కెట్‌లో ధరలు పెరగడానికి కారణమైంది. అధిక పెట్టుబడి, నీటిపారుదల సౌకర్యాల దృష్ట్యా సన్న వరి రకాల వరి సాగు చేసేందుకు రైతులు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారు.

వరి సాధారణ సాగు విస్తీర్ణం సూర్యాపేట జిల్లాలో 3,51,000 ఎకరాలు, నల్గొండ జిల్లాలో 4,40,000 ఎకరాలు, యాదాద్రి-భువనగిరి జిల్లాలో 1,59,719 ఎకరాలు. అయితే, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ (ఎన్‌ఎస్‌పి) ఎడమ కాలువ కింద దాదాపు 10 సంవత్సరాల విరామం తర్వాత క్రాప్ హాలిడే ప్రకటించడం, భూగర్భజలాలు క్షీణించడంతో, గతంలో నల్గొండ జిల్లాలో వరిసాగు దాదాపు 50 శాతం తగ్గింది. ఇప్పటివరకు, రైతులు ఉమ్మడి నల్గొండ జిల్లాలో 6,03,730 ఎకరాల్లో వరి సాగు చేపట్టారు. ఇది సాధారణ సాగు విస్తీర్ణంలో 59.3 శాతమే. దీంతో వచ్చే ఐదారు నెలల్లో మార్కెట్‌లో సన్న బియ్యం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

సన్న బియ్యం కొనుగోలుదారు సుబ్బారెడ్డి మాట్లాడుతూ సన్న బియ్యం ధరలు పెరగడంతో, మధ్య తరగతి కుటుంబాలకు ఆర్థికంగా భారమైందన్నారు. బియ్యం వినియోగాన్ని నివారించడం లేదంటే తగ్గించాల్సి వస్తోందన్నాడు. ఆరుగురు సభ్యులున్న కుటుంబం కేవలం బియ్యం కోసమే నెలకు దాదాపు రూ.3,000 లేదా అంతకంటే ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తోందన్నాడు. ఇది కుటుంబాల “వంట” ఖర్చును దాదాపు రెట్టింపు చేసిందన్నాడు. అదే సమయంలో ఒకసారి పాతిక కేజీలు అలా కొనే బదులు ఐదేసి కేజీలు ప్యాకెట్లు కొనుగోలు చేస్తున్నవారికి భారం మరింత పెరుగుతోందంటున్నారు కస్టమర్లు. బియ్యాన్ని 5 కిలోలుగా ప్యాకెట్లలో కొనుగోలు చేస్తుంటే కిలో ధర రూ. 3 నుండి రూ. 5 వరకు అధికంగా ఉంటుందని చెప్పాడు. బియ్యం ఉత్పత్తి తగ్గడంతోపాటు మిల్లర్లు ఇతర రాష్ట్రాలకు బియ్యాన్ని ఎగుమతి చేయడంతో పాటు పలు కారణాల వల్ల ధరలు పెరుగుతున్నాయని మిర్యాలగూడలోని బియ్యం దుకాణానికి చెందిన ఓ వ్యాపారి తెలిపారు. అయితే, బియ్యం అనివార్యమైన నిత్యావసర వస్తువు కావడంతో ధరల పెంపు ప్రభావం అమ్మకాలపై పడలేదని తెలిపారు.