గణేష్ నిమజ్జన వేడుకలలో 240 మంది పోకిరీలను అరెస్టు చేసిన SHE TEAMS
“సందట్లో సడేమియా” అన్నట్లు ఓ పక్క గణేష్ చతుర్థి నిమజ్జన వేడుకల కోలాహలం, తీన్‌మార్ స్టెప్పులు, బ్యాండ్‌లతో హైదరాబాద్ నగరమంతా సందడిగా ఉంటే పోకిరీ రాయుళ్లు వారి పని వారు చేసుకుపోయారు. ‘పిల్లి కళ్లు మూసుకుని పాలు త్రాగినట్లు’ వారిని ఎవరూ గమనించలేదనుకున్నారు. కానీ SHE TEAMS వారి పని వారు చేశారు.
గణేష్ నిమజ్జనం సందర్భంగా ఏర్పాటు చేసిన బందోబస్తులో పోలీసులు, షీటీమ్స్ ప్రత్యేక దృష్టి పెట్టాయి. మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన పలువురు యువకులు కటకటాల పాలయ్యారు. 240 మందిని షీటీమ్స్ అరెస్టు చేశారు. పదుల సంఖ్యలో యువకులను రెడ్ హాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ వేడుకల్లో షీ టీమ్స్ రహస్య కెమెరాలతో, సివిల్ డ్రెస్సుల్లో మామూలు జనంలో మమేకం అయ్యారు.

ప్రజలు గుంపులుగా ఉన్నచోట్ల మహిళలను ఉద్దేశపూర్వకంగా తాకడం, తప్పుగా ప్రవర్తించిన వారిని గుర్తించి అరెస్టులు చేశారు. రహస్య కెమెరాలతో తీసిన వీడియోలను కోర్టుల్లో సాక్ష్యాలుగా సమర్పించి నిందితులకు శిక్ష పడేలా చేశారు. పలు మండపాల వద్ద షీ టీమ్స్‌ను ముందుగానే మామూలు దుస్తుల్లో ఏర్పాటు చేసినట్లు అదనపు కమీషనర్ (క్రైమ్స్, సిట్, షీ టీమ్, భరోసా) ఏ.ఆర్. శ్రీనివాస్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఎక్కడ ఉన్నా, ఎంతమందిలో ఉన్నా, షీటీమ్స్ కళ్ల నుంచి తప్పించుకోవడం సులువు కాదన్నారు. ఈ పండుగ సందర్భంగా బాగా పని చేసిన షీ టీమ్స్ సిబ్బందిని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సి.వి. ఆనంద్ అభినందించారు.

