11 రోజుల్లో 5 హత్యలు చేసిన సీరియల్ సైకో కిల్లర్..
ఒంటరిగా ప్రయాణం చేసే మహిళలను టార్గెట్ చేసుకుని గొంతు నులిమి చంపి, బంగారు ఆభరణాలు దోచుకెళ్లే సీరియల్ కిల్లర్ గురించి తెలిసి పోలీసులే ఆశ్చర్యపోయారు. ఇటీవల జైలు నుండి విడుదలయిన ఈ సైకో 11 రోజుల్లోనే 5 హత్యలకు పాల్పడిన సంగతి బయటపడింది. కర్నూలుకు చెందిన రమణమ్మ ఈ నెల 23రాత్రి బెల్గావి-మణుగూరు రైల్లో హత్యకు గురికావడంతో ఆ కేసు విచారిస్తున్న పోలీసులకు సంచలన విషయాలు తెలిశాయి. సీసీ టీవీ ఫుటేజ్ ద్వారా హంతకుడు ఫ్లాట్ ఫామ్‌పై కుంటుతూ నడుస్తుండగా పట్టుకున్నారు. అతడు గుజరాత్‌లో ఉన్నట్లు గుర్తించారు. సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అతడిని అరెస్టు చేసి తీసుకురానున్నారు.
హంతకుడు కేవలం నగల కోసమే ఈ హత్యలు చేయడం లేదు. దోపిడీలు, దొంగతనాలు, అత్యాచారాలు, హత్యలు చేసే రాహుల్ జాట్ అనే సైకో కిల్లర్ వికలాంగుడు కూడా. తన అంగవైకల్యాన్ని ఆసరాగా తీసుకుని ఎవరికీ అనుమానం రాకుండా దొంగతనాలు, హత్యలతో చెలరేగిపోతున్నాడు.. హర్యానాకు చెందిన ఈ కిల్లర్ ఐదో ఏటా పోలియా బారిన పడడంతో ఎడమ కాలికి వైకల్యం ఏర్పడింది. ఇతనిపై రాజస్థాన్, హర్యానా, యూపీ, ఉత్తరాఖండ్‌లలో కేసులున్నాయి.

