NationalNews

స్వరం మార్చిన సంజయ్‌ రౌత్‌… త్వరలో మోదీని కలుస్తానని ప్రకటన

మహారాష్ట్రలో ఈ మధ్య రాజకీయ పరిణామాలు చకచకగా మారిపోయాయి. మొన్నటి వరకు బీజేపీని విమర్శించిన వారు ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశంసిస్తున్నారు. మనీలాండరింగ్‌ కేసులో 100 రోజుల జైలు జీవితం గడిపిన శివసేన పార్టీకి చెందిన ఎంపీ సంజయ్‌ రౌత్‌ బెయిల్‌పై విడుదలయ్యారు. జైలు నుండి బయటికి వచ్చిన రౌత్‌ స్వరంలో మార్పు కనిపించింది. బీజేపీ ప్రభుత్వ విధానాలను, బీజేపీ నేతలను ఆయన విమర్శిస్తుంటారు. కానీ, ప్రస్తుతం ఆయన విమర్శలను పక్కన పెట్టినట్లు కనిపిస్తోంది. త్వరలో ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీతోపాటు అమిత్‌ షా ను కలుస్తానని రౌత్‌ అన్నారు. ఉద్ధవ్‌ థాకరే, శరద్‌ పవార్‌ను కూడా కలుస్తానని తెలిపారు.

డిప్యూటీ సీఎం ఫడ్నవీస్‌ తీసుకున్న కొన్ని మంచి నిర్ణయాలను స్వాగతిస్తున్నానని అన్నారు. ప్రజలకు సంబంధించి పనుల కోసం ఫడ్నవీస్‌ను కలుస్తానని రౌత్‌ పేర్కొన్నారు. ఇక అందరినీ ఆశ్చర్యానికి గురి చేసే మరో అంశం ఏమిటంటే ఉద్ధవ్‌ థాకరే ప్రభుత్వాన్ని కూల్చి ఏర్పాటైన ఏక్‌నాథ్‌ సర్కారును రౌత్‌ ప్రశంసించారు. రాష్ట్ర ప్రభుత్వం కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుందంటూ ప్రశంసలతో ముంచెత్తారు. ఎవరి విషయంలోనూ తనకు ఫిర్యాదులు లేవని రౌత్‌ స్పష్టం చేశారు. రాజకీయ ప్రతీకారాన్ని తాను చూడలేదన్నారు. తాను ఎంపీనని.. నాయకులను కలుసుకునే హక్కు తనకు ఉందని.. హోం మంత్రి అంటే దేశం మొత్తానికి.. ఒక పార్టీకి కాదని అని రౌత్‌ తనదైన శైలిలో మీడియాతో ముచ్చటించారు.