రష్యా పౌరులకు చైనాలో ఏడాది పాటు వీసా ఫ్రీ
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్ ల ఎఫెక్ట్ తో చైనా, రష్యా దేశాలు ఒక్కటవుతున్నాయి. రష్యా పౌరులకు చైనా బంపర్ ఆఫర్ ఇచ్చింది. చైనాలో రష్యన్లు పర్యటించేందుకు తాజాగా వీసా ఫ్రీ పాలసీని ఆఫర్ చేస్తోంది. ఈ ఆఫర్ సెప్టెంబర్ 15, 2025 నుంచి సెప్టెంబర్ 14, 2026 వరకు అమల్లో ఉంటుంది. రష్యా నుంచి చైనాకు బిజినెస్ పని మీద వచ్చే వారికి, టూరిస్టులకి, తమ స్నేహితులను, బంధువులను కలుసుకునేందుకు వచ్చే వారికి చైనా వీసా ఫ్రీ పాలసీ చాలా వరకు ఉపయోగపడుతుంది. వాళ్లు రష్యా పౌరులు అయి ఉండి, వారి దగ్గర సాధారణ పాస్‌పోర్టు ఉంటే చాలు చైనాలోకి ఎంట్రీ లభిస్తుంది. నెలరోజుల పాటు ఎలాంటి ఆంక్షలు లేకుండా రష్యా పౌరులు, చైనాలో పర్యటించవచ్చు. దీంతో ఈ రెండు దేశాల మధ్య టూరిజం అభివృద్ధికి మరో అడుగు పడినట్టయింది. అమెరికా తర్వాత చైనా, రష్యా దేశాలు కూడా అంతే ప్రాధాన్యత ఉన్న దేశాలు. ఆర్థికంగా, మానవ వనరుల పరంగా ఏ విధంగా చూసినా ఈ రెండు దేశాలు శక్తివంతమైన దేశాలు.. అలాంటి ఈ రెండు దేశాల మధ్య బంధం ఇప్పుడు మరింత బలపడుతోంది. ఈ ఏడాదిలో కొన్ని లక్షల మంది రష్యన్లు చైనాలో పర్యటించే అవకాశం ఉంది. దీనివల్ల ఈ రెండు దేశాల మధ్య టూరిజం అభివృద్ధితో పాటు వాణిజ్య, ఆర్థిక సంబంధాలు కూడా మెరుగు పడే అవకాశం ఉంది.