ఢిల్లీలో మసీదును సందర్శించిన ఆర్ఎస్ఎస్ చీఫ్
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ ఇవాళ ఢిల్లీ నడిబొడ్డున ఉన్న మసీదును సందర్శించారు. మోహన్ భగవత్ రాకతో స్థానిక ఇమామ్‌లు ఆనందం వ్యక్తం చేశారు. ఆలిండియా ఇమామ్ ఆర్గనైజేషన్ చీఫ్, మత ప్రబోధకుడు ఉమర్ అహ్మద్ ఇల్యాసీతో మోహన్ భగవత్ గంట పాటు ఏకాంతంగా చర్చలు జరిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ముస్లిం నేతలను ఆర్ఎస్ఎస్ చీఫ్ కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. మత గురువు ఉమర్ అహ్మద్ ఇల్యాసీని భగవత్ కలవడం దేశ వ్యాప్తంగా ఆసక్తి రేపింది. ఈ సమావేశంలో భగవత్‌ను ఇల్యాసీ జాతిపిత అని అభివర్ణించారని పీటీఐ తెలిపింది. ఇద్దరి డీఎన్ఏ ఒక్కటేనన్న ఇల్యాసీ… ఇద్దరు ఆరాధించే దేవుడు మాత్రం వేర్వేరు అని చెప్పారు. ఈ సమావేశం దేశానికి మంచి సందేశాన్ని పంపిస్తుందని… అనేక సమస్యలపై పరస్పరం చర్చించుకున్నామని ఆయన తెలిపారు. తమ ఆహ్వానాన్ని భగవత్ మన్నించడం అద్భుతమని మత గురువు కుమారుడు సుహైబ్ ఇల్యాసీ చెప్పారు. ఇల్యాసీతో భేటీ తర్వాత ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మదర్సాను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు.

ఇటీవల కాలంలో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ ముస్లిం మేధావులతో సమావేశమవుతున్నారు. దేశంలో మత సామరస్యాన్ని బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు ఆలిండియా ఇమామ్ ఆర్గనైజేషన్ తెలిపింది. కర్నాటకలో హిజాబ్ ఘటన తర్వాత హింస, నిరసనలతో అట్టుడికింది. ప్రవక్తపై బీజేపీ నేత నుపుర్ శర్మ వ్యాఖ్యలు రచ్చకు కారణమయ్యాయి. దీంతో ఆమెను బీజేపీ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. వారణాసిలోని జ్ఞానవాపి మసీదు సముదాయంలోని ఒక మందిరంలో హిందూ ప్రార్థనలకు సంబంధించిన పిటిషన్ తర్వాత రేగిన ఆందోళనలను శాంతింపజేసేలా భగవత్ చేసిన ప్రకటన ముస్లిం మేధావుల్లో చర్చకు కారణమైంది. ప్రతి మసీదు కింద ఒక శివలింగాన్ని వెతకాలంటూ వచ్చిన వాదనపై భగవత్ తీవ్రంగా స్పందించారు. ఇలాంటి ప్రతిపాదన దేశంలో మరెక్కడా అవసరం లేదని… కొన్ని అరుదైన విషయాల్లో మాత్రమే అలాంటి వాదన ఉందన్నారు. ఘర్షణతో సాధించేదేమీ ఉండదన్నారాయన.

ఆర్‌ఎస్‌ఎస్ సర్సంఘ్‌చాలక్ అన్ని వర్గాల ప్రజలను కలుస్తారని… ఇది నిరంతరం జరిగే ప్రక్రియ అని… ఆర్‌ఎస్‌ఎస్ అధికార ప్రతినిధి సునీల్ అంబేకర్ అన్నారు. ఆగస్టు 22న భగవత్ ఐదుగురు ముస్లిం మేధావులతో సమావేశమయ్యారు. దేశంలో ప్రస్తుత పరిస్థితులను వారితో చర్చించారు. సమస్యలను పెద్దవి కాకుండా రెండు వర్గాల మేధావులు ప్రయత్నించాలని భగవత్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. 75 నిమిషాల పాటు సాగిన సమావేశంలో పాల్గొన్న మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎస్వై ఖురేషీ కీలకంగా వ్యవహరించారు. ఈ భేటీ సందర్భంగా ప్రస్తుతం దేశంలోని అనేక విషయాలపై ఆందోళన ఉందన్న భగవత్… చర్చల ద్వారా అన్ని సమస్యలకు పరిష్కారాలు కనుగొనాలని తెలిపారు. దేశంలో మతాల మధ్య చిచ్చు అక్కర్లేదని… ఐక్యతతో అందరం కలసికట్టుగా ఉండాలని భగవత్ చెప్పారని నాడు ఆయన తెలిపారు.

ఐతే.. హిందువులు గోహత్య వంటి అంశాలపై ఆగ్రహంగా ఉన్నారని… అవి వారిని కలవరపరుస్తున్నాయని భేటీలో భగవత్… ఖురేషీకి వివరించారు. దేశంలోని చట్టాలన్నింటినీ ముస్లింలు గౌరవిస్తారని… ఎవరైనా ఉల్లంఘిస్తే అది నేరమని ఖురేషీ ఈ సందర్భంగా భగవత్ కు క్లారిటీ ఇచ్చారు. కొందరు అతివాదులు ముస్లింలను జిహాదీలని, పాకిస్థానీలు అని పిలుస్తారన్న చర్చ సమావేశంలో సాగింది. ముస్లింల విధేయతపై అనుమానం వ్యక్తం చేస్తున్నారని… ప్రతి విషయంలోనూ దేశభక్తిని నిరూపించుకోవాలని కోరుకోవడాన్ని అంగీకరించబోమన్నారు. ఈ వ్యాఖ్యలపై జోక్యం చేసుకున్న భగవత్… ముస్లింలు కూడా భారతీయులేనని ఇద్దరి డీఎన్‌ఏ ఒక్కటేనన్నారు. ఇండియాలోని ఎక్కువ మంది ముస్లింలు మతం మారినవారేనని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ తెలిపారు. జ్ఞాన్ వాపీ మసీదు విషయంలో భగవత్ ప్రకటన ఆనందాన్ని కలిగించిందని ఖురేషీ తెలిపారు. ఈ సమావేశంలో ఢిల్లీ మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్, అలీఘర్ ముస్లిం యూనివర్శిటీ మాజీ ఛాన్సలర్ లెఫ్టినెంట్ జనరల్ జమీర్ ఉద్దీన్ షా, మాజీ ఎంపీ షాహిద్ సిద్ధిఖీ, వ్యాపారవేత్త సయీద్ షెర్వానీ కూడా పాల్గొన్నారు.


