నితీశ్ కేబినెట్‌లో కీలక పదవులపై ఆర్జేడీ కన్ను
నితీశ్ కుమార్ ఏర్పాటు చేసే కొత్త కేబినెట్‌లో కీలక పదవులపై ఆర్జేడీ కన్నేసింది. బీజేపీతో తెగదెంపులు చేసుకొని మంగళవారం సీఎం పదవికి రాజీనామా చేసిన నితీశ్.. ఆర్జేడీతో కలిసి కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. కూటమిలో అతిపెద్ద పార్టీగా కేబినెట్‌లో సింహభాగం ఆర్జేడీకే దక్కుతుందని ఆశిస్తున్నట్లు ఆ పార్టీ సీనియర్ నాయకుడొకరు తెలిపారు. ఆర్థిక, హోం, ప్రజా పనులు సహా పలు కీలక శాఖల్లో ఆర్జేడీ వాళ్లే ఉంటారని పేర్కొన్నారు. అయితే, నితీశ్ కుమార్ హోం శాఖను తన వద్దే ఉంచుకునేందుకు ఆసక్తి కనబరుస్తారు. గతంలో బీజేపీకి ఇచ్చిన స్పీకర్ పదవిని ఆర్జేడీకి అప్పగించే అవకాశం ఉంది. కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, సీపీఐ(ఎంఎల్) కూడా తమ బలానికి తగ్గట్టు మంత్రి పదవులను కోరే అవకాశముంది.