NationalNews Alert

ఆకాశంలో ఆశల హరివిల్లు- భారత మహిళా పైలట్స్ రికార్డు

Share with

“లేచింది మహిళాలోకం నిద్ర లేచింది మహిళా లోకం”  అంటూ ఏనాడో అన్నగారు N.T. రామారావుగారు గుండమ్మ కథ సినిమాలో పాడారు. నేడు  ఆమాట అక్షరాలా నిజం చేస్తున్నారు మన భారతమహిళలు. ఆకాశంలో సగం అవకాశాల్లో సగం అంటూ అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. తమకు తగిన లక్ష్యాలను పెట్టుకుని వాటికి అనుగుణంగా ప్రావీణ్యాలు సంపాదిస్తున్నారు. పాశ్చాత దేశాలకు నాగరికత కూడా తెలియని 12 వ శతాబ్దంలోనే మన కాకతీయ సామ్రాజ్యాన్ని పాలించిన రాణి రుద్రమదేవి గురించి మనకు తెలిసినదే. తాజాగా భారతదేశం మహిళా పైలట్ల విషయంలో ఒక గొప్ప రికార్డు సాధించింది. అమెరికా, ఆస్ట్రేలియా వంటి అభివృద్ది చెందిన దేశాలను త్రోసిరాజని మహిళా పైలట్ల సంఖ్యలో అగ్రస్థానంలో నిలిచింది. ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ ఉమన్ ఎయిర్ లైన్స్ పైలట్స్ ప్రకారం   మొత్తం పైలెట్ల సంఖ్యలో భారత్‌లో 12.4 శాతం అమ్మాయిలు ఉంటే అమెరికాలో ఇది 5.5 శాతంగానూ, కెనడాలో 4.7 శాతంగానూ ఉంది. భారత వైమానిక దళంలో మహిళా పైలట్లను నియమించడం 1990లోనే ప్రారంభమైనా వారిని రవాణాకు సంబంధించిన విమానాలకే తప్ప యుద్దం చేయడానికి అనుమతించబడలేదు.

1989లో నివేదితా భాసిన్ ప్రపంచంలోనే అతి పిన్న వయస్సు కమర్షియల్ ఎయిర్‌లైన్ కెప్టెన్‌గా నియమింపబడ్డారు. అయితే అప్పట్లో ఇతర సిబ్బంది ఆమెను తమ విమానాన్ని నడుపుతున్న మహిళనుచూసి అసౌకర్యంగా భావించకుండా ఉండేలా కాక్‌పిట్‌లో నెట్టివేసేవారు. కానీ ఇప్పుడు ఆ రోజులు మారాయి. నేషనల్ క్యాడెట్ కార్ప్స్ ఎయిర్ వింగ్ అనే ప్రోగ్రామ్ ద్వారా మైక్రోలైట్ ఎయిర్ క్రాఫ్ట్‌ల ద్వారా విద్యార్థులకు శిక్షణనిచ్చి చాలామంది భారతీయ మహిళలను విమానయానం వైపు ఆకర్షించింది. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఖరీదైన వాణిజ్య పైలట్ శిక్షణ కోసం ఆర్థిక సహాయాన్ని కూడా అందజేస్తున్నాయి. హోండా మోటార్ కో వంటి సంస్థలు ఇండియన్ ఫ్లయింగ్ స్కూల్‌లో 18 నెలల ప్రోగ్రామ్ కోసం పూర్తి స్కాలర్ షిప్‌లను అందిస్తున్నాయి. ఈ మహిళల విజయం వెనుక భారతీయ కుటుంబ వ్యవస్థ కూడా చాలా ప్రముఖ పాత్ర వహిస్తుందని చెప్పవచ్చు. చాలా గంటలు, రోజులపాటు ఇంటికి దూరంగా దేశ, విదేశాలకు వెళ్లి రావల్సిన ఈ ఉద్యోగాలు చేసే స్త్రీలకు ఇంట్లో వారి సహకారం ఎంతో అవసరం. వారి పిల్లల పెంపకం, గృహనిర్వహణ విషయంలో కుటుంబ సభ్యుల సహకారం మన భారత కుటుంబ వ్యవస్థ మూలంగానే అత్తమామలు ,ఇతర బంధువులతో కలిసి జీవించే సంస్కృతి వల్లనే సాధ్యమని చాలామంది మహిళా పైలట్లు తమ అభిప్రాయం వెల్లిబుచ్చారు. అంతే కాదు స్త్రీల చేతిలో ఏదైనా భద్రంగానే ఉంటుంది . వారు ఇల్లు నడపడమే కాదు విమాన్నాన్ని నడపడంలో కూడా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. ఎన్నో ప్రాణాలు వారిచేతుల్లో ఉన్నాయనే స్ఫృహ వారిని భయపెడుతూ ఉంటుంది. జెండర్ డిఫరెన్సెస్ ఇన్ ఏవియేషన్ క్రాషెస్ అనే ఒక సర్వే ప్రకారం 1983 -1997 మధ్య విమాన కూలిపోయిన సంఘటనలలో కేవలం 3 శాతం మాత్రమే  మహిళా పైలట్లు నడిపినప్పుడు జరిగినవి. దీన్నిబట్టి వారు ఏ వాహనాన్ని అయినా ఎంత భద్రంగా నడుపుతారో తెలుస్తోంది. దీనికి గల కారణాలను అన్వేషిస్తే వారు తీసుకునే భద్రతా ఏర్పాట్లు మగవారు తీసుకోరని అర్థమవుతోంది.

ఇండియన్ ఫ్లైట్ స్కూల్ ఇందిరాగాంధీ రాష్ట్రీయ ఉరాన్ అకాడమీ చీఫ్ ఉంజల్ భట్ మాట్లాడుతూ ఈ వృత్తిని కొనసాగించడానికి మహిళలు చాలా ఉత్సాహంగా ఉన్నారని ఎక్కువ అంకిత భావాన్ని కలిగిఉన్నారని తెలియజేసారు. 2020లో అలయన్స్ ఎయిర్ ఏవియేషన్ లిమిటెడ్‌కు నాయకత్వం వహించిన మొదటి మహిళ హర్ ప్రీత్ సింగ్ బాలికలకు విమానయాన పరిశ్రమ గురించి అవగాహన కలిగించడానికి పాఠశాలల్లో ఔట్ రీచ్ ప్రోగ్రామ్‌లను నిర్వహిస్తున్నారు. మహిళలు ఇలా సవాలుగా తీసుకునే ఉద్యోగాలలో అధిక సంఖ్యలో చేరడానికి ఎక్కువ సమయం పట్టదు. అలాగే ఆర్మీ ఏవియేషన్ కార్ప్స్‌లో కంబాట్ ఏవియేటర్‌గా చేరిన తొలి మహిళా అధికారిగా కెప్టన్ అభిలాషా బరాక్  ఫైటర్ జెట్ నడిపి చరిత్ర సృష్టించారు. మాధవేంద్ర బెనర్జీ, రమేష్ సకరామ్ బెంగల్, నివేదితా బాసిన్, వినోద్ భాటియా, సుహాస్ బిశ్వాస్ మొదలైన పేరు పొందిన వనితలెందరో ఈ రంగంలో యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.