Home Page SliderTelangana

రిజర్వాయర్ల నిండా నీళ్లు, రాష్ట్రంలో తాగునీటికి ఢోకా లేదన్న ప్రభుత్వం

రాష్ట్రంలోని రిజర్వాయర్లలో సరిపడా నీరు ఉన్నందున ప్రస్తుత వేసవికాలంలో తాగునీటి అవసరాలకు ఏవిధమైన ఇబ్బందులు లేవని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి స్పష్టం చేశారు. రాష్ట్రంలో తాగునీటి సరఫరా పరిస్థితులపై సంబంధిత శాఖల అధికారులతో నేడు సమీక్షా సమావేశం నిర్వహించారు. మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్, పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా, నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, పంచాయతీ రాజ్ కమీషనర్ అనితా రామచంద్రన్, జీ.హెచ్.ఎం.సి కమీషనర్ రోనాల్డ్ రోస్, మున్సిపల్ శాఖ డైరెక్టర్ దివ్య, మిషన్ భగీరథ ఈ.ఎన్.సి. కృపాకర్ రెడ్డి తదితర అధికారులు ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా సి.ఎస్ మాట్లాడుతూ, యుద్ధప్రాతిపదికన మరమత్తులు చేపట్టి తాగునీటి సరఫరాను నిర్విరామంగా కొనసాగించాలని ఆదేశించారు. గ్రేటర్ హైదరాబాద్ లోనూ సరిపడా నీటిని అందిస్తున్నామని, ఎవరైనా అదనపు వాటర్ ట్యాంకులు కోరితే వాటిని కూడా అందిస్తున్నామని స్పష్టం చేశారు. మంచినీటి సరఫరా విషయంలో ఏవిధమైన ఆందోళనలు అవసరం లేదని అన్నారు. ఈ సందర్బంగా రాష్ట్రంలోని అన్ని రిజర్వాయర్లలో నీటి లభ్యత, వేసవి కాలంలో తాగునీటి సరఫరాకు తీసుకున్నచర్యలపై సంబంధిత శాఖల కార్యదర్శులతో సమీక్షించారు.

పకడ్బందీగా పదవ తరగతి పరీక్షల నిర్వహణ
ఇటీవల ముగిసిన ఇంటర్ పరీక్షల స్పూర్తితో ప్రస్తుతం జరుగుతున్న పదవ తరగతి పరీక్షలను విజయవంతంగా నిర్వహించాలని సి.ఎస్. తెలిపారు పదవ తరగతి పరీక్షల నిర్వహణపై జిల్లా కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. డీజీపీ రవీ గుప్తా, విద్య శాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం, విద్య శాఖ కమీషనర్ దేవసేనలు ఈ టెలికాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా సి.ఎస్ మాట్లాడుతూ, ఎస్.ఎస్.సి పరీక్షలు మొదలై రెండు రోజులు అయ్యాయని, మిగిలిన పరీక్షలను కూడా ఏ విధమైన ఇబ్బందులు కలుగ కుండా నిర్వహించాలని అన్నారు. పరీక్ష కేంద్రాలకు ఎట్టి పరిస్థితుల్లో ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్ ఫోన్లు అనుమతించేది లేదని స్పష్టం చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించడం తోపాటు ప్రతీ కేంద్రం వద్ద కనీసం ఒక కానిస్టేబుల్ లేదా హోమ్-గార్డును నియమించినట్టు తెలిపారు. పరీక్ష పేపర్లను తేవడం తిరిగి పోస్టాపీసీలు తీసుకెళ్లేటప్పుడు తగు బందోబస్తు ఉండాలని పేర్కొన్నారు. ఈవిషయంలో విద్యా శాఖ, పోలీస్ అధికారులు తగు సమన్వయంతో పని చేయాలని అన్నారు. ఇటీవల ముగిసిన ఇంటర్ పరీక్షలను విజయ వంతంగా నిర్వహించడం పట్ల జిల్లా కలెక్టర్లను, అధికారులను సి.ఎస్ అభినందించారు.