మరమ్మతుల పనులకు జీఎస్టీ నుంచి మినహాయింపునివ్వాలి…
తెలంగాణ రాష్ట్రంలో మైనర్ ఇరిగేషన్ కింద 46 వేల జలాశయాలు ఉన్నాయని, వీటి ద్వారా 25 లక్షల ఎకరాలను సాగునీరు అందిస్తున్నామని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. ఈ నిర్వహణ, మరమ్మతుల పనులను జీఎస్టీ నుండి మినహాయింపు ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన 48వ జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ లో ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరుపున పలు విజ్ఞప్తులను కౌన్సిల్ దృష్టికి తీసుకువచ్చారు. జీఎస్టీ నుండి మినహాయింపులు ఇవ్వాలని కోరారు.

పిడిఎస్ (ప్రజా పంపిణీ వ్యవస్థ) సంబంధిత సేవలైన కస్టమ్ మిల్లింగ్, ట్రాన్స్ పోర్ట్ సేవలకు జిఎస్టీ నుండి మినహాయింపు ఇవ్వాలనీ, పేదలకు అందించే ఈ సేవలపై జీఎస్టీ వేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై భారం పడుతున్నదనీ, అందువల్ల జీఎస్టీ నుండి మినహాయింపు ఇవ్వాలని మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. బీడీ ఆకుపై పన్ను వేయడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. గిరిజన, పేద, మారుమూల ప్రాంతాలకు చెందిన ప్రజలు, ముఖ్యంగా మహిళలు ఎంతో మంది బీడీలు తయారీ చేస్తూ ఉపాధి పొందుతున్నారన్నారు. ఇప్పటికే కేంద్రం బీడీ లపై 28 శాతం జీఎస్టీ వేయడం జరిగింది. దీన్ని గతంలో మేము తీవ్రంగా వ్యతిరేకించాము. బీడీ ముడిసరుకు అయిన ఆకులపై ఇప్పుడు 18 శాతం జీఎస్టీ వేయడం పేదలు, గిరిజనుల ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయి. అందువల్ల మినహాయింపు ఇవ్వాలని మంత్రి హరీశ్ రావు కోరారు.

