InternationalNews

మాంద్యం ఎఫెక్ట్‌ షురూ..? తగ్గిన ఎగుమతులు

ప్రపంచంలో నెలకొన్న ఆర్థిక మాంద్యం ప్రభావం భారత్‌పై కనబడటం ప్రారంభమైంది. అక్టోబరులో మన దేశ ఎగుమతులపై మాంద్యం ఎఫెక్ట్‌ పడింది. గత ఏడాది అక్టోబరుతో పోలిస్తే ఈ ఏడాది అక్టోబరులో భారత్‌ ఎగుమతులు 16.65 శాతం క్షీణించాయి. మన ఎగుమతులు 30 బిలియన్‌ డాలర్ల కిందకు చేరుకోవడం గత 20 నెలల్లో ఇదే తొలిసారి. మరోవైపు దిగుమతులు మాత్రం గత ఏడాదితో పోలిస్తే 5.7 శాతం పెరిగి 56.7 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నాయి. ఫలితంగా 50.25 శాతానికి పెరిగిన వాణిజ్య లోటు 26.91 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది. సెప్టెంబరుతో పోలిస్తే అక్టోబరులో వాణిజ్య లోటు 4.7 శాతం పెరగడం గమనార్హం.

ప్రధాన ఎగుమతులకు దెబ్బ..

భారత్‌ ఎగుమతుల్లో ప్రధానంగా నిలిచే ఇంజనీరింగ్‌ వస్తువులకు ఎక్కువ ఇబ్బంది కలిగింది. ఇంజనీరింగ్‌ వస్తువుల ఎగుమతులు 21 శాతానికి పైగా పడిపోయి 7.4 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నాయి. ఐరన్‌ అండ్‌ స్టీల్‌పై విధించిన ఎగుమతి పన్నులే దెబ్బ తీసినట్లు ప్రభుత్వ అధికారులు తెలిపారు. రెడిమేడ్‌ గార్మెంట్స్‌, ఆభరణాలు, విలువైన రాళ్లు వంటి ప్రధాన రంగాల ఎగుమతులు కూడా 21 శాతానికి పైగా పడిపోయాయి. పత్తి, నూలు, చేనేత, హస్తకళ ఉత్పత్తులైతే గత ఏడాదితో పోలిస్తే సగానికి పడిపోయాయి.

ప్రపంచ వృద్ధి ఒక శాతానికి మించదు..

మరోవైపు దీపావళి, దసరా పండుగల కారణంగా ఎక్కువ మంది కార్మికులు సెలవుల్లో ఉండటంతో చాలా రంగాల్లో ఉత్పత్తి కూడా తగ్గిందని వాణిజ్య కార్యదర్శి సునీల్‌ బర్త్‌వాల్‌ చెప్పారు. నవంబరులో ఎగుమతులు, దిగుమతుల లెక్కలు చూసిన తర్వాత మాంద్యంపై సరైన అంచనా వేయగలమని తెలిపారు. 2023లో ప్రపంచ వాణిజ్యంలో వృద్ధి ఒక శాతానికి మించదని డబ్ల్యూటీవో అంచనా వేసింది. మాంద్యం కారణంగా ప్రపంచ మార్కెట్‌ మందగించడంతో భారత ఆర్థిక వ్యవస్థ వచ్చే నెలల్లో మరింత క్లిష్టంగా మారుతుందని అధికారులు భయపడుతున్నారు. ముఖ్యంగా ప్రధాన ఎగుమతుల్లో 17 శాతం క్షీణించడం ఆందోళన కలిగిస్తోంది.