8 మంది ఇండియన్ నావీ సిబ్బందికి క్షమాభిక్షపెట్టిన ఖతార్
ఖతార్‌లో మరణశిక్ష పడిన ఎనిమిది మంది భారత నౌకాదళ మాజీ సిబ్బందిని విడుదల చేసినట్లు భారత్ సోమవారం ప్రకటించింది. వీరిలో ఏడుగురు భారత్‌కు తిరిగి వచ్చినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటనలో తెలిపింది. కెప్టెన్ నవతేజ్ సింగ్ గిల్, కెప్టెన్ సౌరభ్ వశిష్ట్, కమాండర్ పూర్ణేందు తివారీ, కెప్టెన్ బీరేంద్ర కుమార్ వర్మ, కమాండర్ సుగుణాకర్ పాకాల, కమాండర్ సంజీవ్ గుప్తా, కమాండర్ అమిత్ నాగ్‌పాల్, సైలర్ రాగేష్… ఏడుగురు వ్యక్తులు ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేసేవారు. వారు ఖతారి ఎమిరి నావల్ ఫోర్స్‌లో ఇటాలియన్ U212 స్టీల్త్ సబ్‌మెరైన్‌లను ప్రవేశపెట్టడంలో సహాయం చేసేవారు. అయితే వారు ఖతార్ దేశానికి సంబంధించిన వివరాలను బయటకు చేరవేస్తున్నారన్న ఆరోపణలతో అరెస్ట్ అయ్యారు.

అసలు కేసేంటంటే…
2022 ఆగస్ట్ 30: ఖరత్ ప్రభుత్వం ఎలాంటి విచారణ లేకుండా పలు కారణాలతో ఎనిమిది మంది వ్యక్తులను అరెస్టు చేసి, గుర్తు తెలియని ప్రాంంతంలో నిర్బంధించారు. ఖతార్‌లో ఈ ఉద్యోగులందరూ గూఢచర్యం చేస్తున్నారని… ఖతార్ నిఘా సంస్థ వారిని అరెస్టు చేసింది. అక్టోబర్ 1న దోహాలోని భారత రాయబారి, డిప్యూటీ హెడ్ ఆఫ్ మిషన్.. ఎనిమిది మంది నౌకాదళ సిబ్బందిని కలిశారు. అక్టోబర్ 3న వారికి మొదటి కాన్సులర్ యాక్సెస్ మంజూరు లభించింది. దహ్రా గ్లోబల్ CEO కూడా తన అధికారులకు సహాయం చేయడానికి ప్రయత్నించాడు, కానీ చివరకు అరెస్ట్ అయ్యాడు. రెండు నెలలపాటు జైల్లో గడిపి బెయిల్‌పై విడుదలయ్యాడు.

2023 మార్చి 1న నావికాదళ సిబ్బంది బెయిల్ పిటిషన్లను అక్కడి కోర్టులు తిరస్కరించాయి. మార్చి 25న ఎనిమిది మంది వ్యక్తులపై అభియోగాలు నమోదు చేశారు. మార్చి 29: ఖతార్ చట్టాన్ని అనుసరించి విచారణ ప్రారంభమైంది. మే 30: దహ్రా గ్లోబల్ దోహాలో తన కార్యకలాపాలను మూసివేసింది. మాజీ ఉద్యోగులు, ఎక్కువగా భారతీయులు స్వదేశానికి తిరిగి వచ్చేశారు. ఆగష్టు 4న అరెస్టయిన సిబ్బందిని గుర్తు తెలియని ఏకాంత ఖైదు నుండి… వారి సహోద్యోగులతో జైలు వార్డుకు తరలించారు. ఒక్కో సెల్‌లో ఇద్దరు వ్యక్తులను ఉంచారు.

అక్టోబర్ 26న ఖతార్ కోర్టు మొత్తం ఎనిమిది మందికి మరణశిక్ష విధించింది. నవంబర్ 9న ఎనిమిది మంది మాజీ నేవీ సిబ్బందికి మరణశిక్ష విధించడంపై అప్పీల్ దాఖలు చేసినట్టు ఖతార్‌లోని భారత అధికారులు తెలిపారు. నవంబర్ 23న మరణశిక్షకు వ్యతిరేకంగా భారతదేశం చేసిన అప్పీల్‌ను కోర్టు స్వీకరించింది. డిసెంబరు 28న ఎనిమిది మంది మాజీ నేవీ సిబ్బంది మరణశిక్షను మారుస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. 2024 ఫిబ్రవరి 12న భారత నౌకాదళానికి చెందిన ఎనిమిది మంది సిబ్బందిని విడుదల చేసినట్లు భారతదేశం ప్రకటించింది.

