లయన్ సిటీలో గర్జించిన పివి సింధు
సింగపూర్ ఓపెన్ వరల్డ్ టూర్ 500 టోర్నీలో పి.వి. సింధు సత్తా చాటింది. దాదాపు 58 నిమిషాలు సాగిన ఫైనల్లో ప్రపంచ ఏడో ర్యాంకర్ సింధు 21-9, 11-21, 21-15 తో ప్రపంచ 11వ ర్యాంకర్ ఆసియా చాంపియన్ వాంగ్ జి యి పై విజయం సాధించింది. మూడు గేమ్స్ గా కొనసాగిన ఈ వరల్డ్ టూర్ సూపర్ 500 లో , మెదటి గేమ్ లో సింధు 2 పాయింట్లతో వెనుకంజ వేసినా… పట్టు విడవకుండా ప్రయత్నిస్తూ.. 13 పాయింట్లు గెలిచి మెదటి గేమ్ విజేతగా నిలిచింది. రెండో గేమ్ లో కాస్త తడబడిన సింధు వరుసగా ఆరు పాయింట్లు కోల్పోవడంతో వాంగ్ విజేతగా నిలిచింది.
ఇక ఆఖరి రౌండ్ లో ఇద్దరు పోటా పోటిగా తలపడినా… కీలక దశలో సింధు విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ ఏడాది జరిగిన స్విస్ ఓపెన్ , సయ్యద్ మోదీ ఓపెన్ టైటిల్స్ గెలుచుకున్న సింధు, సింగపూర్ ఓపెన్ టైటిల్ తో మెత్తంగా మూడు టైటిల్స్‌ను కైవసం చేసుకొని తన ప్రతిభను చాటుకుంది. గతంలో కూడా సింగపూర్ ఓపెన్ టోర్నీలో పాల్గొన్న సింధు ఒకసారి తొలి రెండ్ , ప్రిక్వార్టర్ ఫైనల్లో , రెండు సార్లు క్వార్టర్ ఫైనల్లో , మరోసారి సెమీఫైనల్లో పాల్గొనగా… ఈ సారి ఆరో ప్రయత్నంగా ఈ టైటిల్‌ను సాధించింది. ఈ విజయంతో సింధుకు 9,200 ర్యాకింగ్ పాయింట్లతో పాటు 27,750 డాలర్ల ప్రైజ్‌మనీ లభించింది. ఈ సందర్భంగా సింధూ మాట్లాడుతూ టైటిల్ ఎంతో ప్రత్యేకమన్నారు. ఇదే జోరును కామన్వ్‌ల్త్ గేమ్స్ , ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కొనసాగిస్తా అని పేర్కొంది. నెల రోజులుగా వరుస టోర్నీలో పాల్గొన్న ఆమె రెండు తోజులు విశ్రాంతి తీసుకొని , మిగత టోర్నీలకు సిద్ధమవుతానన్నారు. సింధుకు అటు ప్రధాని మోదీ, ఇటు తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం వైఎస్ జగన్ అభినందనలు తెలిపారు.