Andhra PradeshHome Page Slider

ఏపీలో ముందస్తు ఖాయం ప్రధాని మోదీతో జగన్ చర్చలు సఫలం!?

ఏపీలో ముందస్తు ఎన్నికలు ఖాయమేనా ?

◆ సీఎం ఢిల్లీ టూర్ పై పలు ఊహాగానాలు
◆ 2023 మే చివరి నాటికి అసెంబ్లీ రద్దు చేయాలన్న ఆలోచనలో జగన్
◆ రెండు రోజుల ఢిల్లీ పర్యటన సారంశంపై రాజకీయ విశ్లేషకులు అంచనా
◆ కేంద్ర పెద్దల నుండి లభించిన అనుమతి?

ఏపీలో గడిచిన ఆరు నెలల నుండి రాజకీయ వేడి మొదలైంది. ప్రధాన పార్టీలన్నీ ప్రజలతో మమేకం అవుతూ తమ వ్యూహాలకు పదును పెడుతూ వస్తున్నాయి. ఏపీలో ముందస్తు ఎన్నికలు ఖాయమని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తమ పార్టీలో నాయకులకు చెబుతూ ఆ దిశగానే పావులు కదుపుతూ అడుగులు వేస్తూ వస్తున్నారు. వైసీపీ అధినేత సీఎం జగన్ వరుసగా తీసుకుంటున్న నిర్ణయాలు కూడా ముందస్తు ఎన్నికలు ఖాయమనే విధంగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు కూడా పలుమార్లు చెబుతూ వస్తున్నారు. అయితే ముందస్తు ఎన్నికలపై జరుగుతున్న ప్రచారం చివరి అంకానికి వచ్చినట్లు కనిపిస్తుంది. ముందస్తు ఎన్నికలకు సంబంధించి సీఎం ఢిల్లీ టూర్ సందర్భంగా పలు వూహాగానాలు వస్తున్నాయి. అయితే ఇవి ఢిల్లీలో నిజమైనట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగానే రాష్ట్రంలో కీలక పరిణామాలు జరగబోతున్నాయని అంటున్నారు.

ఇప్పటివరకు ఢిల్లీకి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన విభజన అంశాలు పెండింగ్ నిధులు తదితర అంశాలపై కేంద్ర పెద్దలను కలుస్తున్న సీఎం జగన్ ఈసారి ద్విముఖ వ్యూహంతో ఢిల్లీకి వెళ్లినట్లు కనిపిస్తుంది. పాలన రాజకీయపరమైన అంశాలపై కేంద్ర పెద్దల నుండి స్పష్టత తీసుకున్నట్లు ఆయన రెండు రోజుల ఢిల్లీ పర్యటన సారాంశంగా తెలుస్తుంది. ఈసారి ఢిల్లీ పర్యటనలో ముఖ్యంగా రాజకీయ అంశాలపై వారి మధ్య పెద్ద ఎత్తున చర్చ జరిగినట్లు అందరూ భావిస్తున్నారు. 2023లో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఒకటి రెండు మాసాల్లో అంటే మే చివరికల్లా అసెంబ్లీని రద్దు చేయాలన్న ఆలోచనతో ఉన్నట్లు సీఎం జగన్ కేంద్ర పెద్దలకు వివరించారని తెలుస్తోంది. సీఎంగా ఆయన పదవీ బాధ్యతలు చేపట్టి మే 31 నాటికి నాలుగేళ్ల కాలం పూర్తవుతుంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో ముందస్తుకు వెళ్లాలన్న దానిపై కేంద్ర పెద్దల నుండి అనుమతి కోరుతూ అందుకు గల కారణాలను కూడా ఆయన వివరించారని అంటున్నారు. అందుకు వారు కూడా ఓకే చెప్పటంతో సీఎం పర్యటన విజయవంతంగా పూర్తయినట్లు రాష్ట్రంలో ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ముందస్తు ఎన్నికలకు సంబంధించి పార్టీలోని కీలక నేతలకు కూడా అంతర్గతంగా జగన్ సంకేతాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది.

బయటికి మాత్రం ముందస్తు ఎన్నికల సమస్య లేదని ప్రకటనలు గుప్పిస్తున్న నేతలు అంతర్గతంగా మాత్రం అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వైసీపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గడపగడపకు ప్రభుత్వ కార్యక్రమం మార్చిలో ముగుస్తుంది. ఆ తర్వాత ముందస్తు ఎన్నికలకు సంబంధించి కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయని అంటున్నారు. అందుకు తగినట్లుగానే ప్రభుత్వం ఇప్పటినుంచే పావులు కదుపుతున్నట్లు అర్థమవుతుంది. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు ఎప్పుడైనా జరగొచ్చు అనే భావంలో ప్రధాన పార్టీల నాయకులు ఉండటంతో దానికి తగినట్లుగానే వారు నిత్యం జనంలోనే ఉంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమం ద్వారా వివిధ జిల్లాల పర్యటనలు చేస్తూ ఉన్నారు. చంద్రబాబు తనయుడు లోకేష్ పాదయాత్ర కూడా జనవరి 27 నుంచి ప్రారంభమైతే ఒకేసారి తండ్రి కొడుకులు జనంలోనే ఉండేందుకు వీలవుతుంది. అదే సమయంలో పవన్ కళ్యాణ్ కూడా వారాహితో యాత్ర మొదలు పట్టేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ పరిణామాలన్నీ ముందస్తుకు సూచనలుగానే భావించాల్సి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

జగన్ ఢిల్లీ టూర్ లో ఉన్న సమయంలోనే రాష్ట్రంలో నిఘవర్గాలకు ముందస్తుకు సిద్ధంగా ఉండాలని సంకేతాలు అందినట్లు ప్రచారం జరుగుతుంది. దీని ప్రకారం ముందస్తు ఎన్నికలకు తగినట్లుగా క్షేత్రస్థాయిలో నిఘా సమాచారం అందించేందుకు సిద్ధంగా ఉండాలని కోరునట్లు తెలుస్తుంది. ఇందుకోసం సిబ్బంది నియామకం మార్పులు చేర్పులు మొహరింపులు ఉండాలని ప్రభుత్వం సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. దీంతో నిఘా వర్గాలు కూడా అప్రమత్తమయ్యాయి. ముందస్తుకు ఎన్నికల కోసమే ఈ సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తుంది. దీంతో ఏపీలో ముందస్తు ఎన్నికలపై చర్చ మరింత పెరిగింది. మరి ఇన్ని పరిణామాల నేపథ్యంలో రాబోవు సంవత్సరంలో ఏపీలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయా లేవా అనేది వేచి చూడాల్సి ఉంది.