జనం బాట పట్టిన రాజకీయ పార్టీలు
సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు వివిధ కార్యక్రమాలు
ఎలక్షన్ కోడ్ వచ్చే వరకు జనంలోనే ఉండేలా కార్యాచరణ
నిత్యం ప్రజల మధ్య ఉండేలా ప్రణాళికలు
ఖరత్నాక్ స్కెచ్ వేసుకుంటున్న మూడు పార్టీలు
ఏపీలో రానున్న ఎన్నికల్లో ఎలాగైనా పాగా వేసి తమ సత్తా చూపాలని రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. అధికార వైసీపీ త్వరలో బస్సు యాత్రకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తోంది. ఆయా జిల్లాల అధ్యక్షులు బస్సు యాత్రలు నిర్వహించేలా ఆ పార్టీ సన్నాహాలు చేస్తోంది. ఇక తెలుగుదేశం పార్టీ బాబు షూరిటీ – భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో ప్రతి గ్రామంలో ప్రజలను కలుసుకునే విధంగా ప్రణాళికలు రూపొందిస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రజలకు మరింత చేరువవ్వాలని ఉద్దేశంతో అన్ని పార్టీలు ఎన్నికల ప్రచార కథనరంగం మొదలుపెట్టాయి. అధికార వైసీపీ ప్రజలకు మరింత చేరువ అయ్యే ఉద్దేశంతో బస్సు యాత్ర చేపట్టడానికి ఏర్పాట్లు చేసుకొంది. గత ఎన్నికల సమయంలో పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టాక అనేక సంక్షేమ పథకాలు చేపట్టారు. ఇప్పుడు ఆ సంక్షేమ పథకాలతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించారు.

ఈ క్రమంలోనే ఇప్పటికే గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చేపట్టి స్థానిక ఎమ్మెల్యేలతో పాటు నేతలను ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందాయా లేదా అన్న అంశంపై ఆరా తీయించారు. ఇప్పుడు బస్సు యాత్రతో మరింత చేరువయ్యేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. దీంతో పాటు పార్టీ పునర్ వ్యవస్థీకరణ పై దృష్టి సారించిన జగన్ ఆ క్రమంలోనే జిల్లా పార్టీ అధ్యక్షులు నూతన కార్యవర్గాలను ఎంపిక చేశారు. ఈ నెలాఖరులోగా మండల కమిటీల నియామకాలు కూడా పూర్తి చేయనున్నారు. ఈ కమిటీలు పూర్తికాగానే ఆయా జిల్లాలలో బస్సు యాత్రలు నిర్వహించనున్నారు. ఇలా ఏదో ఒక కార్యక్రమంతో సెప్టెంబర్ నుండి నవంబర్ వరకు వందరోజుల ప్రణాళికలతో వివిధ కార్యక్రమాలతో నిత్యం ప్రజల మధ్య ఉండేలా కార్యాచరణను రూపొందించుకుంటున్నారు. దీంతోపాటు జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రజల విజ్ఞప్తి కారణంగా మరోమారు నిర్వహించాలని కూడా నిర్ణయించినట్లు తెలుస్తోంది.

మరోవైపు అధికార పార్టీకి ధీటుగా తెలుగుదేశం పార్టీ కూడా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఇప్పటికే ఆ పార్టీ మహాశక్తి యాత్రతో పాటు భవిష్యత్తుకు గారెంటీ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. యువనేత నారా లోకేష్ యువగళం పేరిట పాదయాత్ర కొనసాగిస్తున్నారు. తన యాత్రలో అధికార పార్టీ వైఫల్యాలతో పాటు స్థానిక ఎమ్మెల్యేల అవినీతి అక్రమాలను కడిగేస్తూ పాదయాత్రను కొనసాగిస్తున్నారు. ఇక ఎన్నికల దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశం పార్టీ నేతలు కూడా నిత్యం ప్రజల్లో ఉండేలా చంద్రబాబు ప్రణాళికలను రచిస్తున్నారు. సెప్టెంబర్ నుంచి బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో ప్రజల్లోకి వెళ్లాలని ఒక కొత్త కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఇంటిని ఆ ప్రాంత నాయకులు సందర్శించేలా కార్యక్రమం రూపొందిస్తున్నారు.

ఇక జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర పేరుతో ప్రజల్లో తిరుగుతున్నారు. ఇలా అన్ని పార్టీలు ఎన్నికల కోడ్ వచ్చేంతవరకు వివిధ కార్యక్రమాలతో ప్రజల మధ్య గడిపేలా తమ కార్యక్రమాలను రూపొందిస్తున్నారు. మొత్తం మీద పార్టీలోనే బూత్ లెవల్ నుండి రాష్ట్ర స్థాయి వరకు వివిధ కార్యక్రమాల్లో నిత్యం బిజీ బిజీగా ఉండేల అనేక కార్యక్రమాలకు పార్టీలు తెర లేపాయి.

