కీచకులను పట్టుకున్న పోలీసులు
హైదరాబాద్ నగరాన్ని కుదిపేసిన కూకట్ పల్లి రేణు అగర్వాల్ హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో నిందితులైన ఇద్దరిని రాంచీలో అరెస్టు చేసినట్లు సీపీ అవినాష్ మహంతి వెల్లడించారు. హత్య అనంతరం నిందితులు హఫీజ్‌పేట్ నుంచి సికింద్రాబాద్ వెళ్లి అక్కడి నుంచి రైలులో రాంచీకి చేరుకున్నారని, రాంచీలో పోలీసుల కదలికలు గమనించి క్యాబ్‌లో పరారయ్యే ప్రయత్నం చేశారని చెప్పారు. రేణు అగర్వాల్ ఇంట్లో 7 తులాల బంగారం, కొంత నగదు ఎత్తుకెళ్లారని, రోల్డ్ గోల్డ్ ఆభరణాలను నిజమైన బంగారమని భావించి దోపిడీకి పాల్పడ్డారని తెలిపారు. ఎవరినైనా ఇంట్లో పనికి పెట్టుకునే ముందు వారి నేపథ్యం పూర్తిగా తెలుసుకోవాలని ప్రజలకు సూచించారు.
బుధవారం సాయంత్రం కూకట్ పల్లి స్వాన్ టేక్ గేటెడ్ కమ్యూనిటీలో జరిగిన ఈ దారుణ ఘటనలో, వంట మనిషిగా పరిచయమైన యువకుడు మరో వ్యక్తితో కలిసి రేణు అగర్వాల్‌పై దాడి చేశాడు. ఆమె చేతులు, కాళ్లు కట్టేసి చిత్రహింసలు పెట్టి, కుక్కర్‌తో తలపై కొట్టి హత్య చేశాడు. అనంతరం నగదు, బంగారం దోచుకుని, అదే ఇంట్లో స్నానం చేసి యజమానికి చెందిన ద్విచక్రవాహనంపై పరారయ్యారు. ఈ ఘటనతో నగరంలో కలకలం రేగింది.

