పోలవరాన్ని బాబు ఏటీఎంలా వాడుకున్నారన్న రోజా
తాము అధికారంలోకి వస్తే పోలవరం ముంపు గ్రామాలను జిల్లాగా ఏర్పాటు చేస్తామన్న చంద్రబాబు వ్యాఖ్యలపై మంత్రి రోజా మండిపడ్డారు. తిరుమల శ్రీవారిని మంత్రి ఆర్కే రోజా దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ భగవంతుని ఆశీస్సులతో మంత్రినయ్యానని, వరదలైపోయాక కూడా చంద్రబాబు బురద రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.14 ఏళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు ఎందుకు పోలవరం పూర్తి చేయలేదన్నారు. జయము జయము చంద్రన్న అంటూ భజనలు చేయించుకుని, చంద్రబాబు పోలవరాన్ని ఏటీఎం కార్డులా వాడుకున్నారని ఆరోపించారు. తన హయంలో సొంత నియోజకవర్గం కుప్పంను మున్సిపాలిటీ చేయలేని వ్యక్తి…. ముంపు గ్రామాలను జిల్లాగా చేస్తారా? అంటూ ఎద్దేవా చేశారు. ఎన్ని సంక్షోభాలు వచ్చినా పేదవాళ్ల సంక్షేమం కోసం సీఎం జగన్ పని చేస్తున్నారని, కేంద్రంపై ఒత్తిడి తెచ్చి సీఎం జగన్ మోహన్ రెడ్డి పోలవరం ప్రాజెక్టును పూర్తిచేస్తారని ఉద్ఘాటించారు.
Read more: తిరుమల శ్రీవారి హుండీ రికార్డు ఆదాయం