2024లో ప్రధాని అభ్యర్థి పై అమిత్ షా క్లారిటీ
వాజపేయ్ తర్వాత బీజేపీలో మంచి జనాదరణ, జనాకర్షణ ఉన్న నాయకుడు ప్రధాని నరేంద్రమోదీ. చాలాకాలం నుంచి అధికారంలో స్థిరపడిపోయిన కాంగ్రెస్‌ను ఢీకొట్టి దేశమంతా సుడిగాలి పర్యటన చేసి, ప్రజల ఆదరణను, ఆమోదాన్ని పొందిన మోదీ 2014 సార్వత్రిక ఎన్నికలలో అత్యధిక మెజారిటీ సాధించారు. బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చారు. ఒకసారి మాత్రమే కాదు వరుసగా రెండుసార్లు ప్రజల నమ్మకాన్ని చూరగొన్న మోదీ తర్వాత 2019 ఎలక్షన్స్‌లో కూడా ప్రధాని పీఠాన్ని అధిరోహించారు. 2024 ఎన్నికలలో ప్రధాని అభ్యర్ధిగా ఎవరుంటారని చాలా రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. తాజాగా కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఈ విషయంలో కీలక ప్రకటన చేసారు. రాబోయే ఎన్నికలలో కూడా ప్రధాని మోదీనే బీజేపీ ప్రధాన అభ్యర్థిగా ఉంటారని స్పష్టం చేసారు. ప్రధాని మోదీ మూడవసారి కూడా గెలుపొంది హ్యాట్రిక్ కొడతారన్నారు. పాట్నాలో రెండు రోజులపాటు జరిగిన బీజేపీ మోర్చాల ఉమ్మడి జాతీయకార్యవర్గ సమావేశాలలో అమిత్‌షా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్రధాని అభర్థి విషయంలో క్లారిటీ ఇచ్చారు.
కశ్మీరీలు తయారుచేసిన త్రివర్ణ పతాకాలను సభలో అందరికీ పంపిణీ చేసారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీరీల ఆలోచనల్లో మార్పు వచ్చిందని, వారు స్వయంగా ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కోసం జాతీయ జెండాలను తయారుచేసినట్లు తెలిపారు అమిత్‌షా. ఈసందర్భంగా ఆగస్టు 13 నుండి 15 వరకూ ప్రతీ ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని పిలుపునిచ్చారు. ఈసారి బీజేపీ ఎన్నికలకు చాలా ముందుగా అంటే 2 సంవత్సరాల ముందుగానే పావులు కదుపుతోంది. బీజేపీ జాతీయనాయకులందరూ వివిధ రాష్ట్రాలలో పర్యటిస్తూ పార్టీ శ్రేణులలో ఉత్సాహాన్ని నింపుతున్నారు.