మాజీమంత్రి జేఆర్ పుష్పరాజు కన్నుమూత
లెక్చరర్ నుంచి రాజకీయవేత్తగా ఎదిగిన పుష్పరాజు
తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం కొనసాగిన పుష్ప రాజ్
వామపక్ష కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన జేఆర్ పుష్పరాజు స్వగ్రామం బుడంపాడు. 1956 జూన్ 1న జ్ఞానసుందరమ్మ, బిక్షాలు దంపతులకు జన్మించారు. నలుగురు సోదరులు, ఇద్దరు చెల్లెళ్లు. తల్లిదండ్రులిద్దరూ ఉపాధ్యాయులే. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం మొదటి బ్యాచ్ (1976-78)లో ఎమ్మెస్సీ పూర్తిచేసి, కర్నూలులో బీఎడ్ చదివారు. వెంటనే విజయవాడ సిద్ధార్థ కళాశాలలో లెక్చరర్ గా చేరారు. జై ఆంధ్ర ఉద్యమంలో జైలుకు కూడా వెళ్లారు. ఆ తరువాత జనతా, లోక్ దళ్ లో పనిచేశారు. 1982 మార్చిలో ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించడంతో యువ లోక్ దళ్ యథావిధిగా డాక్టర్ యలమంచిలి శివాజి నాయకత్వంలో ఆ పార్టీలో కలసిపోయింది.
1983 ఎన్నికల్లో సీనియర్ నేత టి.అమృతరావుపై గెలుపొందిన పుష్పరాజు విద్యావంతుడిగా చిన్నవయస్సులో అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత 1985, 1999 ఎన్నికల్లో తాడికొండ నుంచి విజయం సాధించారు. 1994 ఎన్నికల్లో సీటు మిత్రపక్షం సీపీఐకి కేటాయించడంతో పుష్పరాజు కు టిక్కెట్ లభించలేదు. ఆ ఎన్నికల్లో మంగళగిరికి చెందిన ట్రేడ్ యూనియన్ నాయకుడు జీఎంఎన్వీ ప్రసాద్ పోటీచేసి గెలుపొందారు. 1984లో స్పిన్ ఫెడ్ చైర్మన్ గాను సేవలందించారు. రెండు పర్యాయాలు (1987-89, 2001-2004) రాష్ట్ర మంత్రిగా, రెండు పర్యాయాలు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా, టీడీఎల్పీ ఉపనేతగా (1999-2004) పనిచేసిన పుష్పరాజు, టీడీపీలోనూ వివిధ పదవుల్లో కొనసాగి, సుదీర్ఘకాలం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నారు.2017లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంలో ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ గా పుష్పరాజు నియమితులై 2021 మే వరకు కొనసాగారు.
1983లో తాడికొండ నుంచి పోటీచేయడానికి ఎన్టీ రామారావు టిక్కెట్ కేటాయించడంతో బీ ఫారంతో హైదరాబాద్ నుంచి వచ్చిన పుష్పరాజు పోటీచేయడానికి వీల్లేదని కుటుంబ సభ్యులు ఒత్తిడి తెచ్చారంట. వీరి మామ దేవరాజ్ నుదురుపాడులో టీడీపీ నాయకుడిగా ఉన్నారు. ఆయన పుష్పరాజు కుటుంబ సభ్యులకు నచ్చజెప్పి ఒప్పించారు. అలా తొలి ఎన్నికలోనే తాడికొండ నుంచి గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టిన లెక్చరర్ పుష్పరాజ్ తెలుగుదేశం పార్టీలో ఎదిగి సుదీర్ఘకాలం ప్రజాజీవితంలో ఉన్నారు.పుష్పరాజు భార్య మేరీ క్రిస్టియానా స్వగ్రామం ఫిరంగిపురం మండలం నుదురుపాడు. పీఈటీ ఉపాధ్యాయినిగా పనిచేశారు. వీరి ఇద్దరు కుమారులు గ్రాహేష్, లోకేష్ లు ఇంజనీరింగ్ పట్టభద్రులు. ఓర్పు, సహనానికి మారుపేరుగా నిలిచే పుష్పరాజు.. శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయినా.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆయన జ్ఞాపకాలు పదిలంగానే ఉంటాయి.