NationalNews

మంత్రి పార్థా ఛటర్జీకి షాకిచ్చిన సీఎం మమత

Share with

టీచర్ రిక్రూట్‌మెంట్ కుంభకోణంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్ర పరిశ్రమలు,వాణిజ్యశాఖ మంత్రి పార్థ ఛటర్జీని మంత్రి పదవి నుంచి తప్పిస్తూ సీఎం మమతా బెనర్జీ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల ఈడీ దాడుల్లో కోట్లాది రూపాయలు పట్టుబడటం తీవ్ర కలకలం రేపింది. మరోవైపు.. అర్పితా ముఖర్జీ నివాసాల్లో 18 గంటల పాటు సాగిన ఈడీ సోదాల్లో కీలక పత్రాలతో పాటు దాదాపు 50 కోట్ల రూపాయల నగదు.. ఐదు కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. పది ట్రంకు పెట్టెల్లో నగదుతో పాటు నగలు, డాక్యుమెంట్లను డీసీఎం వ్యానులో అధికారులు తరలించారు.

2014-2021 వరకు పార్థా చటర్జీ విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన హయాంలోనే విద్యాశాఖలో ఈ కుంభకోణం వెలుగుచూసింది. ఈ కేసుకు సంబంధించి ఆయన్ను ఈడీ అధికారులు ఇప్పటికే సుదీర్ఘంగా ప్రశ్నించారు. అరెస్టు తర్వాత ఆయన్ను ఆస్పత్రికి తరలించి ఆరోగ్య పరీక్షలు చేయించారు. దీంతో అధికారంలో ఉన్న తృణమూల్‌ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ప్రభుత్వంలో మూడో నెంబర్‌గా కొనసాగుతున్న మంత్రిపై ఆరోపణలు వెల్లువెత్తడంతో సీఎం మమత ప్రతిపక్షాల నుంచి విమర్శల దాడులను ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో పార్థ చటర్జీపై చర్యలు తీసుకునే అవకాశం ఉందనే వార్తలు వచ్చిన నేపథ్యంలో అందుకు అనుగుణంగానే మంత్రివర్గం నుంచి పార్థ చటర్జీని తప్పిస్తూ మమత నిర్ణయం తీసుకున్నారు. మంత్రి పార్థ చటర్జీ, నటి అర్పితను అదుపులోకి తీసుకున్న ఈడీ అధికారులు నిన్న వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత తమ కస్టడీలోకి తీసుకున్నారు. స్కామ్‌లో ఇంకా ఎవరెవరి పాత్ర ఉందనే దానిపై విచారణ సాగుతోంది. మరోవైపు మంత్రిపై నటి అర్పిత సంచలన వ్యాఖ్యలు చేసింది. తన పర్సనల్‌ గదిని మంత్రి మినీ బ్యాంక్‌గా వాడుకున్నారని ఆరోపించింది. ఎంత డబ్బు దాచాడో తనకు తెలియదని చెప్పుకొచ్చింది.