తెలుగు ప్రజానీకానికి పెద్ద ప్రకృతి విపత్తు చంద్రబాబు నాయుడు- విజయసాయి రెడ్డి విమర్శలు
( విజయసాయి రెడ్డి ప్రెస్ రీలీజ్)
పాలనలో చేసింది తక్కువ, అలాగే విపక్ష నేతగా అర్ధంలేని మాటలు ఎక్కువ
టీడీపీ హయాంలో అనావృష్టి తాండవం–తుపాన్ల సమయంలో సాయం నాస్తి
ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవలి భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన కోస్తా జిల్లాల రైతులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్సార్సీపీ ప్రభుత్వం సకాలంలో తక్షణ సాయం అందిస్తోంది. ఇవేమీ విపక్ష తెలుగుదేశం నేత చంద్రబాబు నాయుడుకు కనపడడం లేదు. ఆయన పార్టీ నాయకులు తమ అధినేత దారిలో నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు గాని జరుగుతున్న వరద సాయం వారి కళ్లపడడం లేదు. ప్రకృతి విపత్తులు చంద్రబాబు సీఎంగా ఉండగా ఎంత ఎక్కువ సంభవించాయంటే అసలు ఆయనే తెలుగు ప్రజలకు పెద్ద విపత్తు అని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆయన పాలన, విభజిత ఏపీలో ఐదేళ్ల టీడీపీ నిర్వాకం చెప్పకనే చెబుతున్నాయి.
ఆయన మొదట ముఖ్యమంత్రిగా పనిచేసిన 1995–2004 మధ్యకాలం వరదల కన్నా ఎక్కువ అనావృష్టిని గుర్తుచేస్తుంది. 1999 సెప్టెంబర్ ఎన్నికల్లో తెలుగుదేశం రెండోసారి అధికారంలోకి వచ్చాక చంద్రబాబు ఆర్థిక సంస్కరణలు ఒకపక్క జనం నడ్డి విరుస్తుంటే, తీవ్ర అనావృష్టి ప్రజలను కుదేలయ్యేలా చేసింది. ప్రకృతి విపత్తులు పాలకుల చేతుల్లో ఉండవుగాని చంద్రబాబు క్రియాశూన్యత, బాధ్యతా రాహిత్యం, ఉదాసీన వైఖరి వల్ల 2000–2004 మధ్య వర్షాభావంతో కరువు పరిస్థితులు తెలుగునాట విలయతాండవం చేసినప్పుడు ప్రజలకు ప్రభుత్వ సాయం కనిష్ఠస్థాయిలో కూడా అందలేదు. ఉపాధి కల్పనకుగాని, రుణభారంతో బలవన్మరణాలకు దిగుతున్న రైతన్నలను ఆదుకోవడానికి గాని చంద్రబాబు చేసింది లేదు. గోదావరి వరదల సమయంలో సైతం తెలుగుదేశం సర్కారు నీటమునిగిన ప్రాంతాల బాధితులకు తక్షణ సాయం చేసింది చాలా స్వల్పం. ప్రతిపక్ష నేతగా వైఎస్ రాజశేఖర రెడ్డి ఎంత మొత్తుకుంటున్నా ప్రభుత్వ పరంగా ప్రజలకు అందిన సాయం నామమాత్రమే.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా మూడేళ్లు కరువు పరిస్థితులతో అతలాకుతలమైన తెలుగు ప్రజానీకానికి 2004 మే మూడోవారం వైఎస్ నాయకత్వాన కాంగ్రెస్ సర్కారు రావడం ప్రకృతి ఇచ్చిన వరంగా మారింది. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినప్పటి నుంచీ ఆయన ప్రభుత్వం కరువు సాయంపై దృష్టి పెట్టి సామాన్య ప్రజానీకాన్ని, రైతులోకాన్ని అనూహ్యమైన రీతిలో ఆదుకుని కన్నీళ్లు లేకుండా చేశారు. ఆయన సీఎంగా ఉన్నన్ని రోజులూ ప్రకృతి శాంతించింది. అది కన్నెర చేసిన సమయాల్లో వైఎస్ శరవేగంతో అమలు చేసిన సహాయ చర్యలు ప్రజలకు ఊహించనిరీతిలో ఉపశమనం కలిగించాయి.
చంద్రబాబు చివరిసారి ముఖ్యమంత్రిత్వం వెలగబెట్టిన విభజిత ఆంధ్రప్రదేశ్‌లో హుద్‌హుద్ తుపానుతో పాటు వరదలు సంభవించినప్పుడు టీడీపీ సర్కారు నుంచి బాధిత ప్రజానీకానికి తక్షణ సహాయ చర్యలు చాలినన్ని లేవు. ప్రచారార్భాటంతో, విశాఖపట్నంలో తాత్కాలిక మకాంతో చంద్రబాబు చేసినది హడావుడే తప్ప అసలు సహాయం కాదు. 2014లో మూడోసారి సీఎం అయ్యేనాటికి 36 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉందని గొప్పలు చెప్పుకున్నారు చంద్రబాబు. అంతేగాని. ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజలకు భరోసా ఇచ్చే రీతిలో ఎన్నడూ ఆయన ఆదుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వాధినేతగా స్థానికంగా జనానికి సాయం అందించడంలో ఎలాగూ ఆయనది వైఫల్యమే. కనీసం సంక్షోభాల సమయంలోనైనా, తన మిత్రపక్షంగా ఉన్న ఢిల్లీలోని పాలకపక్షం దగ్గర పలుకుబడి ఉపయోగించి కేంద్ర ప్రభుత్వ సాయమైనా ప్రజలకు వచ్చేలా ఆయన చేయలేకపోయారు. ప్రకృతి విపత్తుల కన్నా అత్యంత ప్రమాదకరమైన వి చంద్రబాబు ముఖ్యమంత్రిత్వం, తెలుగుదేశం పాలన అనే నిజాలు తెలుగు ప్రజల మనసుల్లో శాశ్వతంగా నిలిచిపోయాయి. ప్రకృతి విపత్తుకు ప్రతిరూపంగా చంద్రబాబు తెలుగువారికి ఎప్పటికీ గుర్తుండిపోతారు. జగన్ సర్కారు వరదబాధితులకు శాయశక్తులా చేస్తున్న సాయంపై ఇకనైనా తెలుగుదేశం బురద చల్లడం ఎంత త్వరగా మానుకుంటే అంత మంచిది.