Andhra PradeshNews Alert

జనసేనానికి జేజేలు

“కంటెంట్ ఉన్నవాడి కటౌట్ చాలు” అంటారు బ్రహ్మానందం “గబ్బర్ సింగ్” సినిమాలో పవన్ కళ్యాణ్ గురించి. ఈ మాట చక్కగా సరిపోతుంది పవన్ కళ్యాణ్‌కి. కేవలం ఆయన కటౌట్ కనిపిస్తే చాలు ప్రేక్షకులకి పూనకాలు వచ్చేస్తాయి. నిజానికి పవన్‌ పెద్ద డైలాగులు చెప్పరు. చిరంజీవిలా పెద్ద డాన్సర్ కాదు. అయినా పవన్ క్రేజ్ మామూలుగా లేదు. ఆ పేరే ఒక కిక్కు. ఈరోజు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పవన్ సినీ ప్రస్థానం గురించి మాట్లాడుకుందాం.

చిన్నవయస్సులో పవన్‌కెప్పుడూ అనారోగ్యమే. అస్తమా కూడా ఉండేది. ఎక్కువగా ఎవ్వరితో మాట్లాడేవారు కాదు. ఇంటర్లో ఒకసారి పరీక్ష కూడా తప్పారట. అప్పట్లో ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యకు కూడా ప్రయత్నించానని చెప్పుకున్నారు పవన్. ఆసమయంలో ఇంట్లో వారి సహకారం బాగా లభించిందని, చదివినా,చదవకపోయినా తాము ప్రేమిస్తూనే ఉంటామని ధైర్యం చెప్పారని అన్నారు. ఫిన్లాండ్‌లో చదువుకునే రోజుల్లో పార్ట్‌టైమ్ జాబ్ చేద్దామనుకుని ప్రింటింగ్ ప్రెస్‌లో కొన్నాళ్లు, వేర్‌హౌస్‌లో కొన్నాళ్లు పనిచేసారు. కర్నాటక సంగీతంలో కూడా ప్రవేశం ఉంది. కొన్నాళ్లు వయెలిన్ సాధన కూడా చేసారు. తర్వాత కంప్యూటర్ ప్రోగ్రామింగ్, ఎలక్ట్రానిక్స్ డిప్లొమా కోర్సు మొదలైన అనేక కోర్సుల్లో చేరారు. తర్వాత సినిమాలపై దృష్టి పెట్టి, సత్యానంద్ వద్ద శిక్షణ పొందానని, ఆ శిక్షణాకాలంలోనే సిగ్గు, మొహమాటం తగ్గించుకుని, బతకగలననే ధైర్యం లభించిందని అన్నారు. సినిమా షూటింగ్ వాతావరణం కృత్రిమంగా అనిపించేదని, చాలాసార్లు సినిమాలు మానేద్దామనుకున్నానని, కానీ ఇంట్లోవారి ప్రోత్సాహంతో ఒక్కో సినిమా చేసుకుంటూ వస్తున్నానని అన్నారు.

“అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి” సినిమాతో 1996లో మొదటి సినిమాలో నటించారు. అది పెద్ద విజయం సాధించక పోయినా కళ్యాణ్ బాబు స్టంట్స్‌కి మంచిపేరు వచ్చింది. తర్వాత కాలంలో కళ్యాణ్ పేరుకి చిరంజీవి పవన్ అనే పేరుచేర్చి పవన్ కళ్యాణ్‌గా మార్చారు. పేరు బలం ఏమో కానీ  తర్వాత కాలంలో సినిమాలు హిట్ అవడంతో పాటు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగా పెరిగింది. “గోకులంలో సీత”, “సుస్వాగతం”, “తొలిప్రేమ”, “బద్రి”, ‘తమ్ముడు’, ‘జల్సా’, ‘గబ్బర్ సింగ్’, ‘అత్తారింటికి దారేది’, ‘వకీల్ సాబ్’, ‘అజ్ఞాతవాసి’, ‘భీమ్లానాయక్’ వంటి చిత్రాలతో యువతను ఉర్రూతలూగించారు పవన్. దర్శకులలో త్రివిక్రమ్ శ్రీనివాస్‌, పవన్ కళ్యాణ్ జోడీని బాగా ఆదరిస్తున్నారు ప్రేక్షకులు. వారిద్దరూ కూడా చాలా సన్నిహితులు, మంచి మిత్రులు కూడా.

సినిమాలే కాకుండా సామాజిక సృహ కలిగిన వ్యక్తిగా, అభిమానుల అండదండలతో పవన్ కళ్యాణ్ జనసేన అనే పార్టీని 2014లో  స్థాపించారు. కానీ ఆసంవత్సరమే ఆంధ్రప్రదేశ్ విభజన జరగడంతో అప్పట్లో ఎన్నికలలో పోటీ చేయలేదు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో తెలుగుదేశం,బీజేపీ కూటమికి మద్దతు ప్రకటించి, ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. పవన్ స్టార్‌డమ్ కూడా అప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కారణమయ్యిందని చెప్పవచ్చు. తర్వాత ఎన్నికలలో గెలుపు సాధించక పోయినా, ప్రజల్లో పలుకుబడి, క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు సరికదా చాలా పెరిగింది. ప్రస్తుతం ప్రజలతో మమేకమై రాజకీయాలలో, ప్రజాసేవలో చాలా చురుకుగా పని చేస్తున్నారు పవన్. ప్రస్తుతం ఆయన హరిహర వీరమల్లు  అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇంకా రాబోయే సినిమాలలో హరీశ్ శంకర్, సురేందర్ రెడ్డి, సముద్రఖని దర్శకత్వంలో కూడా నటించబోతున్నారు. పవన్‌కి అన్నయ్య చిరంజీవి చెప్పిన జన్మదిన శుభాకాంక్షలు చాలా వైరల్ అయ్యాయి. ఆ వీడియో చూసేద్దామా..