టిడిపిని నిర్మాణాత్మకంగా దెబ్బతీస్తున్న పవన్
జనసేన ఆవిర్భవించింది ప్రశ్నించడం కోసం….పవన్ పుట్టింది కూడా ప్రశ్నించడం కోసమే.ఈ మాటలు మీడియా అన్నది కాదు…విపక్షాలు చేసిన వెటకారం అంతకంటే కాదు.స్వయంగా పవన్ కళ్యాణ్ ఇప్పటికే కొన్ని పదుల సార్లు అనేక వేదికల మీద చేసిన వ్యాఖ్యలు.ఈ తరుణంలో ఆయన కూటమి భాగస్వాములను కూడా ప్రశ్నిస్తున్నారు.ఇప్పుడిదే హాట్ టాపిక్ గా మారింది. చాలా ముందస్తు ప్రణాళికతోనే కూటమి పెద్దన్న అయిన టిడిపిని ఇరుకున పెడుతున్నాడు పవన్.తిరుమల తొక్కిసలాట అనంతరం పర్యటించిన పవన్ కళ్యాణ్ తప్పంతా అధికారులదేనని స్టేట్ మెంట్ ఇచ్చారు.అంతటితో ఆగకుండా భద్రతా ఏర్పాట్లు లేవని చురకలంటించారు.మరో వైపు చంద్రబాబు నాయుడు పరామర్శించి నిజానిజాలు తెలుసుకుంటుండగానే పవన్ ఈతరహా వ్యాఖ్యలు చేయడంలో ఆంతర్యం లేకపోలేదు.టిడిపిని నిర్మాణాత్మకంగా దెబ్బతీసే ఎత్తుగడకు బీజెపి నేతృత్వంలో బీజం పడినట్లు కనిపిస్తుంది.వాస్తవానికి కూటమిలో భాగస్వామ్య పక్షంగా ఉన్నప్పుడు సీఎంతో చర్చించకుండా ఏ స్టేట్ మెంట్ కూడా ఇవ్వకూడదు.ఇది కూటమి ధర్మం.కానీ తప్పు జరిగింది మన్నించండి అని పవన్ కోరడం విచిత్రంగా ఉంది.అంతే కాదు…సీజ్ ది షిప్ విషయంలో, హోం మంత్రి అనిత విషయంలో, ఇలా ఆయన తేనె పూసిన కత్తిలా టిడిపిని ప్రజా కోర్టులో దోషిగా నిలబెడుతూనే ఉన్నాడు.ఏవైనా అనుకోని ఘటనలు జరిగినపుడు ప్రభుత్వం స్పందించేలోపే ఆ బాధ్యత ప్రభుత్వానిదే అన్నట్లుగా స్టేట్ మెంట్ ఇస్తున్నాడు.నిశితంగా గమనిస్తే…షిప్పు వ్యవహారం,హోం మంత్రి వ్యవహారం, ఇప్పుడు తిరుమల ఘటన,ఇవాళ పిఠాపురం వ్యాఖ్యలు ఇవన్నీ చూస్తుంటే పవన్ వెనుక ఎవరో ఉన్నారనిపిస్తుంది. శుక్రవారం పిఠాపురంలో పర్యటించిన పవన్ కళ్యాణ్…టిటిడి ఛైర్మన్ బీ.ఆర్.నాయుడు,చౌదరిలపై విరుచుకుపడ్డారు.తనకు నామోషి లేదని అందుకే సారీ చెప్పానని,కావున తొక్కిసలాటకు సంబంధించి మీరు కూడా సారీ చెప్పాలని కోరారు.అంతే కాదు…ఒక అడుగు ముందుకేసి క్షమాపణ చెప్పడానికి మీకెందుకంత నామోషీ అని బీ.ఆర్.నాయుడు తదితరులను నిలదీశారు.వాస్తవానికి ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ ఫోన్ చేసి బీ.ఆర్.నాయుడుకి చెప్తే సరిపోయేది.పవన్ మాట ప్రకారం కచ్చితంగా సారీ చెప్పే వాడు. కానీ ఇదే విషయాన్ని పబ్లిక్ లో రాద్దాంతం చేయడం ద్వారా జరిగిన తొక్కిసలాట నెపాన్ని టిడిపి మీద వేసి తాను కడిగిన ముత్యాన్ని అనిపించుకోవాలని చూస్తున్నాడు.కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ….టిడిపి మంత్రులను,ప్రజాప్రతినిధులను బద్నాం చేయడం ఇది పవన్ కళ్యాణ్‌కి ఐదోసారి.

