పవన్ నోట మూడో ముచ్చట
పొత్తులపై తేల్చేశాడు. తాను ఎవరి తొత్తును కాదని.. ఎవరి అడుగులకు మడుగులొత్తనని చెప్పాడు. మార్పు కోసం తుది వరకు పోరాడతానని అన్నారు. రాస్కో సాంబా… అంటూ మూడో ప్రత్యామ్నాయం అంశాన్ని తెరపైకి తెచ్చారు. ఇదే ఇప్పుడు హాట్ టాపిగ్గా మారింది. తెలుగుదేశం పార్టీకి జనసేన తొత్తుగా వ్యవహరిస్తోందని, తనను దత్తపుత్రుడు అంటూ ఎద్దేవా, ఎగతాళి, వెటకారం, వ్యంగ్యం కలగలిపిన మాటలతో విమర్శలు చేసిన నేతల నోటికి తాళం వేశాడు పవన్ కల్యాణ్.

2019 ఎన్నికల్లో ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగిన జనసేన ఈసారి ఎవరితో కలిసి పోటీ చేసేది ఇంకా నిర్ణయించుకోలేదు. కానీ.. ఎవరికి వారే ఏదేదో ఊహించుకుని విమర్శలు చేస్తున్నారు. జనసేన మీద.. పవన్ కల్యాణ్ మీద ఆరోపణల మీద ఆరోపణలు గుప్పిస్తున్నారు. సహనంతో .. ఓర్పుతో అన్ని భరిస్తున్నా ఇక తట్టులేమని తేల్చేశారు పవన్ కల్యాణ్. తన మనసులో ఉన్న అభిప్రాయాలు బయటపెట్టారు. ఇప్పుడున్న పరిస్ధితుల్లో బలమైన మూడో ప్రత్యామ్నాయం అవసరం అన్నారు. విధ్వంస పూరిత రాజకీయాలను ఎదుర్కోవాలంటే ..శత్రువులతోనూ కలవక తప్పదన్న భావనను వ్యక్తం చేశారు. అది కూడా ఓ సుహృద్భావ వాతావరణం ఉంటేనే .. ఎవరి గౌరవానికి భంగం కలగకుండా ఉంటేనే తాము కలుస్తామని చెప్పారు. ఏది ఏమైనా ప్రజల్లో చైతన్యం రానంత కాలం ఫ్యాక్షన్ రాజకీయాలు ఉంటూనే ఉంటాయన్నది పవన్ అభిప్రాయం.

ఏపీలో ఇప్పుడు ప్రధాన పార్టీలు మూడే ఉన్నాయి. ఒకటి వైసీపీ.. రెండు తెలుగుదేశం.. మూడు జనసేన. వైసీపీతో జనసేనకు అస్సలు పొసగని పరిస్థితి. తెలుగుదేశంతో సంబంధాలు అంత బలీయంగా లేవు. ఇక కాంగ్రెస్ అస్సలు ఉనికి లోనే లేదు. బీజేపీ స్ధితి గట్టిగానే ఉంది. వామపక్షాలు అంతంత మాత్రంగా ఉన్నాయి. అయితే వైసీపీతో జనసేనకు తీవ్ర విభేధాలు ఉన్నాయి. రెండు పార్టీలు నిప్పు ఉప్పులా ఉంటాయి. ఇక తెలుగుదేశానికి తమ పార్టీ అంట కాగుతోందని .. చంద్రబాబు ప్రభావం పవన్ పై తీవ్రంగా ఉందని అధికార పార్టీ ఆరోపణల స్వరాన్ని పెంచింది. దత్త పుత్రుడు అంటూ నోటి దురుసు విమర్శలు కూడా చేస్తున్నారు. ఈ నేపధ్యంలో టీడీపీతో కలిసి నడుస్తామని గానీ.. పొత్తు పెట్టుకుంటామని గానీ తేల్చి చెప్పకుండా మూడో ప్రత్యామ్నాయం అంశాన్ని తెరపైకి తెచ్చారు పవన్ కల్యాణ్. అయితే ఏఏ పార్టీలు కలిసి మూడో ప్రత్యామ్నాయం గా రూపుదిద్దుకోబోతున్నాయి అన్నది అసక్తి రేపుతోంది. బీజేపీ నేతృత్వంలో మూడో ప్రత్యామ్నాయ శక్తి ఏర్పడబోతోందా అన్నది సందేహం.

రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ సర్కార్ ను గద్దె దించేందుకు అన్ని శక్తులు ఏకం కావాలని.. ఈ అంశంలో ఎవరితోనైనా కలిసి పని చేస్తామని గతంలో పవన్ కల్యాణ్ ప్రకటించారు. అలాగే బీజేపీ కూడా జనసేనతో కలిసి రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తామని స్పష్టం చేసింది. స్వయంగా ఆ పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజే ఈ ప్రకటన చేశారు. దీంతో బీజేపీతో కలసి బలీయమైన మూడో ప్రత్యామ్యాయ శక్తికి పవన్ ప్రయత్నిస్తున్నారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. వారితో టీడీపీ కలుస్తుందా లేదా అన్నది ఇంకా స్పష్టం కాలేదు. అయితే తిరిగి ఎన్.డీ.ఏలో చేరాలని టీడీపీ తహతహలాడుతోంది. ఈ మేరకు ఢిల్లీలో ప్రయత్నాలు కూడా మొదలు పెట్టింది. ప్రధాని మోదీని కలిసేందుకు చంద్రబాబు కూడా ఉత్సాహం చూపిస్తున్నారు. మరి వారి ప్రయత్నాలు ఫలిస్తే .. పవన్ చెప్పిన మూడో ప్రత్యామ్నాయం తెరపైకి వచ్చే అవకాశం ఉంది. బీజేపీ నేతృత్వంలో టీడీపీ, జనసేనతో పాటు మరి కొన్ని పార్టీలు కూడా ఈ కూటమిలో చేరే అవకాశాలు ఉన్నాయి. ఇదే జరిగితే 2024లో జరిగే ఎన్నికలు అత్యంత ఆసక్తిగా మారే అవకాశాలు ఉన్నాయి.

