Home Page SliderInternational

 ‘కూతురు’ ఉద్యోగానికి జీతం ఇస్తున్న అమ్మానాన్నలు

చైనాలో ఓ కుటుంబంలో వింత సంఘటన చోటు చేసుకుంది. ఒక కూతురు తన తల్లిదండ్రులను చూసుకోవడమే ఉద్యోగంగా మార్చుకుంది. దీనికి జీతంగా నాలుగువేల యువాన్‌లు తీసుకుంటోంది. చైనాకు చెందిన నియానన్ అనే మహిళ గత సంవత్సరం వరకూ న్యూస్ ఏజెన్సీలో పనిచేసేది. ఈ పని 15 ఏళ్లుగా చేస్తుండడంతో ఆమెకు వచ్చే ఫోన్‌ కాల్స్ చాలా ఎక్కువగా ఉండేవి. దీనితో చాలా మానసిక ఒత్తిడికి గురయ్యింది. తల్లిదండ్రులు ఎంతైనా తల్లిదండ్రులే కదా. కుమార్తె కష్టాన్ని చూడలేకపోయారు. వారే తమ కుమార్తెకు ఉద్యోగం కల్పిస్తే, ఆమెకు ఈ ఒత్తిడి ఉండదని ఆలోచించి, ఆ ఉద్యోగం వదిలేయమని, తమను చూసుకుంటే చాలు నెలకు 4 వేల యువాన్‌లు ఇస్తామని చెప్పారు. దీనితో ఆమె ఆనందంగా అంగీకరించింది. దీనితో అద్దె ఇల్లు వదిలి తల్లి ఇంటికి వచ్చేసింది.

వారిని ప్రేమగా చూసుకుంటూ ఫుల్‌టైమ్ డాటర్‌గా పని చేస్తోంది. ఈ కొత్త ఉద్యోగం చాలా బాగుందని,  ప్రేమతో నిండిపోయిందని, తనకు ఖర్చులన్నీ తగ్గాయని పేర్కొంది. తన తల్లిదండ్రులతో చాలాకాలం తర్వాత మంచి సమయం గడుపుతున్నానని, వారితో మార్కెట్‌కు వెళ్లడం, డ్రైవింగ్ చేయడం, డ్యాన్స్ చేయడం వంటి పనులు చేస్తూ ఖుషీగా గడుపుతోంది. ఇక తల్లిదండ్రులు కూడా ఇదే కాకుండా ఇంకా ఖాళీ సమయంలో పని చేయాలని ఉంటే అదనపు సంపాదనకు కూడా ప్రోత్సహిస్తున్నారు. వారికి నెలకు లక్ష యువాన్ల్ పెన్షన్ వస్తుందట. దీనిలో నుంచే ఆమెకు జీతం ఇస్తున్నారు. దీనితో ఆన్‌లైన్‌లో రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చైనాలో ఉదయం 9 గంటల నుండి రాత్రి 9 గంటల వరకూ పనివేళలు ఉండడంతో యువత చాలా మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. దీనితో చాలామంది పని పూర్తిగా మానేస్తున్నారు. ‘లేయింగ్ డౌన్’ అనే ప్రక్రియను అనుసరిస్తున్నారు. అందుకే నియానన్ చేసిన పనిని ప్రశంసిస్తున్నారు.