రష్దీపై పద్మాలక్ష్మి ట్వీట్
వివాదాస్పద రచయిత సల్మాన్ రష్దీపై ఇటివల జరిగిన హత్యాయత్నం ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత ఆయన మాజీ భార్య, భారతీయ అమెరికన్ మోడల్, రచయిత్రి పద్మాలక్ష్మి ట్విటర్ ద్వారా స్పందించారు. తీవ్ర గాయాల నుంచి రష్డీ కోలుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
సల్మాన్ రచించిన ‘ద సటానిక్ వర్సెస్’ నవలలో పాత్రలు చేత పలికించబడిన సంభాషణలు రష్దీ ప్రాణం మీదకి తెచ్చాయి. ఈ నవలలో ఇస్లాం మతాన్ని, ఆ మత ప్రవక్తను అవమానించారనేది రష్దీపై ఉన్న ప్రధాన అభియోగం. అయితే ఆ నవలలో ఉన్న విషయాన్ని చదవకుండానే దురభిప్రాయాన్ని ఏర్పరచుకొని ఇరాన్‌కు చెందిన ఒక మతాచార్యుడు ఫత్వా జారీ చేశారని, పాకిస్తాన్ మత గురువుల అభిప్రాయమే దానికి ప్రాతిపదికని అమెరికాలో స్థిరపడిన ఇరాన్‌కు చెందిన రమితా నవాయ్ అనే మహిళ ఈ మధ్యకాలంలో ట్వీటర్‌లో తెలిపారు. అందులో వాస్తవాలు ఎలా ఉన్నా ఒక సృజనాత్మక రచయితకు ప్రాణాంతకం కావడం సభ్యసమాజం జీర్ణించుకోలేనిదన్నారు. కవులు, రచయితలు, కళాకారులు ప్రపంచ దేశాలలో ఈనాటికీ మృత్యు నీడలో బ్రతికే పరిస్థితి ఏర్పడటం దారుణమని ఆవేదన వెలిబుచ్చారు.