NationalNewsNews Alert

అస్ధికలు తెండి… డీఎన్ఏ పరీక్షలు చేయండి..

Share with


ఆయన కరుడు గట్టిన దేశభక్తుడు. సాయుధ పోరాట యోధుడు. బ్రిటీషర్ల గుండెల్లో ఫిరంగులు పేల్చిన సాహసవంతుడు. ఆజాద్ హింద్ ఫౌజ్ తో సంగ్రామ భేరీలను మోగించిన ధైర్యవంతుడు. భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ఆయన పాత్ర అమేయం. అనుపమానం. కానీ.. ఆయన మరణమే ఇంకా వీడని సస్పెన్స్ గా ఉంది. స్వాతంత్య్రానికి ముందే ఓ విమాన ప్రమాదంలో మృతి చెందారన్న వార్త ఇప్పటికీ నమ్మబుద్ధి కానిదిగానే భావిస్తారు. ఆయన మృతికి సంబంధించి వందలాది రహస్య పత్రాలను భారత్ బయటపెట్టినప్పటికీ .. ఆయన మరణం వెనుక కారణాలు మాత్రం ఇప్పటికీ ఓ మిస్టరీగానే మిగిలి పోయాయి. దీనిపై ఎన్నో వాదనలు జరిగాయి. భిన్నాభిప్రాయాలూ వ్యక్తమయ్యాయి. కానీ.. ఇంత వరకు నిజం ఏంటో బయటకు రాలేదు. ఆ వీరుని మరణం వెనుక రహస్యం ఏమిటో ఎవరికీ అంతుబట్టకుండానే మిగిలి పోయింది.


నేతాజీ సుభాష్ చంద్రబోస్ . ధైర్యానికి మారు పేరు. దేశభక్తికి మరో రూపు. త్వరితగతిలో స్వాతంత్య్రం సాధించాలంటే సాయుధ పోరాటం ఒక్కటే మార్గమని నమ్మిన ధీరోధాత్తుడు. ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ వ్యవస్ధాపకుడు. ఆజాద్ హిందూ ఫౌజ్ నిర్మాత. ఎన్నో పోరాటాలు సాగించారు. యూరప్ గడ్డ నుండి బ్రిటీషర్ల గుండెల్లో ప్రకంపనలు లేపారు. ఆయుధాలు పడితేనే .. స్వారాజ్యం లభిస్తుందని నమ్మి సాయుధ పోరాటానికి తెరతీశారు. ఓ దండును కట్టారు. దండయాత్ర చేశారు. తెల్లవారికి భయం ఏంటో చూపారు. అలాంటి నేత ఎవరికీ అంతుబట్టి రీతిలో చనిపోవడమే ఇప్పటికీ మిస్టరీగా నే ఉంది. 1945 ఆగస్ట్ 18న తైవాన్ వద్ద జరిగిన విమాన ప్రమాదంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ చనిపోయినట్లు జపాన్ రేడియో ప్రకటించింది. ఈ వార్త భారత్ ను తీవ్ర దిగ్భ్రమలో పడేసింది. ఎంతో ఆందోళనకు గురి చేసింది. కానీ.. అప్పట్లో విమాన ప్రమాదమేమీ జరగలేది అనేక నివేదికలు పేర్కొన్నాయి. కానీ.. నిజం ఏంటో ఎవరికీ తెలియలేదు. ఇప్పటికీ వెలుగు చూడలేదు. అంతుబట్టని ఆ మిస్టరీ అలా ఉంటే.. ఇప్పుడు కొత్త డిమాండ్ తెరపైకి వచ్చింది. నేతాజీ కుమార్తె అనితా బోస్ టోక్యోలోని రెంకోజీ ఆలయంలో ఉన్న నేతాజీ అస్ధికలను భారత్ కు తీసుకు రావాలని డిమాండ్ చేస్తున్నారు.


భారత్ కు స్వాతంత్ర్యం లభించి 75 ఏళ్ళు గడిచినా నేతాజీ అస్ధికలను తీసుకురాక పోవడంపై అనితా బోస్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే తగిన సమయం అంటూ ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. అప్పట్లో నేతాజీ అస్ధికలను జపాన్ రాజధాని టోక్యోలోని రెంకోజీ ఆలయంలో భద్రపరిచారు. ఇప్పటికే ఆయన మరణంపై అనేక సందేహాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. ఆ సందేహాలన్నింటినీ నివృత్తి చేయాలంటే .. నేతాజీ అస్ధికలను తీసుకురావడంతో పాటు వాటికి డీ.ఎన్.ఏ పరీక్షలు నిర్వహించాలని అనితా బోస్ డిమాండ్ చేశారు. అసలు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎప్పటి వరకు జీవించి ఉన్నారు? చివరి రోజుల్లో ఎక్కడ ఉన్నారు? ఎలా ఉన్నారు? ఎప్పుడు? ఎలా చనిపోయారు? వంటి అనేక ప్రశ్నలు ఇప్పటికీ శరాల్లా దూసుకు వస్తూనే ఉన్నాయి. భారత్ కు స్వాతంత్య్రం రావాలని పరితపించిన నేతల్లో ఆయన కూడా ఒకరు. ఇప్పుడు స్వాతంత్య్రం వచ్చింది. కానీ.. నేతాజీ లేరు. కనీసం ఆయన అస్ధికలనైనా భారత్ కు తీసుకు రండి అంటూ అనితా బోస్ సూచించారు. ఆయన అస్ధికలకు డీ.ఎన్.ఏ పరీక్షలు నిర్వహించాలని ఎంతోకాలంగా వారి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ఇందుకు రెంకోజీ ఆలయ అధికారులు సిద్ధంగా ఉన్నా .. భారత్ మాత్రం స్పందించడం లేదన్న అభియోగాలు ఉన్నాయి.


ఇప్పటికి మూడు తరాలు మారాయి. అయినా నేతాజీ అస్ధికలను రెంకోజీ ఆలయ అధికారులు సంరక్షిస్తూనే ఉన్నారు. ఇంకెన్నాళ్ళు అస్ధికలు అక్కడ ఉండాలి అంటూ జర్మనీలో నివసించే నేతాజీ కుమార్తె అనితా బోస్ ప్రశ్నిస్తున్నారు. 79 సంవత్సరాలఅనితా బోస్ ఆర్ధిక శాస్త్ర ప్రొఫెసర్. తన దగ్గర కార్యదర్శిగా పని చేస్తున్న ఎమిలీ అనే మహిళను 1937లో నేతాజీ ఆస్ట్రియాలో వివాహం చేసుకున్నారు. ఈ వివాహం అతి రహస్యంగా జరిగింది. 1942లో అనితా బోస్ జన్మించారు. అప్పటి నుండి ఆమె జర్మనీలోనే నివసిస్తున్నారు. అయితే తన తండ్రి నేతాజీ చితాభస్మం పట్ల జరుగుతున్న నిర్లక్ష్యాన్ని ఆమె తట్టుకోలేక పోతున్నారు. ఓ దేశభక్తుని చితాభస్మాన్ని ఆయన మాతృభూమికి తీసుకురాలేని స్ధితిలో భారత్ ఎందుకు ఉందని ఆమె సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఆయన విమాన ప్రమాదంలో చని పోలేదన్నది పలు దర్యాప్తు బృందాలు చెప్పిన మాట. ఇప్పటికి మూడు బృందాలు ఇదే అంశంపై దర్యాప్తు సాగించాయి. చివరి సారిగా వేసిన జస్టిస్ ఎం,కే. ముఖర్జీ కమిటీ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.


నేతాజీ మృతిపై ఎన్ని రకాల అనుమానాలు ఉన్నా.. ఆయన అస్ధికల విషయంలో అన్నా తగు చర్యలు తీసుకోవాలని అనిత కోరుతున్నారు. గతంలో తమ కుటుంబ సభ్యులు అందరినీ కలిసిన ప్రధాని మోదీ .. నేతాజీ విషయంలో అన్ని రకాలుగా సహకరిస్తామని హామీ కూడా ఇచ్చారు. ఇప్పుడు అనిత డిమాండ్ తో ఆ దిశగా ఇప్పుడు ఎలాంటి ప్రయత్నాలు జరుగుతాయి అన్నది వేచి చూడాల్సిందే.