Home Page SliderTelangana

‘పేరు మాత్రమే మార్చాం’.. డీఎన్‌ఏ, అజెండా, గుర్తులు అలాగే ఉన్నాయి

టీఆర్‌ఎస్.. బీఆర్‌ఎస్‌గా పేరు మాత్రమే మార్చామని, సిద్ధాంతాలు కాదని తేల్చి చెప్పారు మంత్రి కేటీఆర్. పార్టీ గుర్తులు, ఎజెండా, డీఎన్‌ఏ మారలేదన్నారు. తెలంగాణాను బంగారు తెలంగాణాగా మార్చిన కేసీఆర్, దేశాన్నంతా గోల్డెన్ భారత్‌గా మార్చగలరని విశ్వాసం వ్యక్తం చేశారు. సిరిసిల్లలోని బైపాస్ రోడ్డులో నిర్వహించిన ప్లీనరీలో మాట్లాడుతూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అధికారం కోసం అర్రులు చాస్తున్నాయని కేటీఆర్ మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ నుండి వెళ్లి, తెలంగాణాతో తిరిగొస్తానని ఢిల్లీకి వెళ్లిన ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకున్న గొప్పవ్యక్తి అని ప్రశంసించారు. తెలంగాణా కేసీఆర్ నాయకత్వంలో దేశానికే ఆదర్శంగా అభివృద్ధి చెందిందని, ఒకప్పుడు డిగ్రీ కాలేజీ కూడా లేని సిరిసిల్ల ఈనాడు ఇంజనీరింగ్, మెడికల్, ప్రైవేట్ యూనివర్సిటీలు ఏర్పాటు చేసే స్థాయికి చేరుకుందని, ప్రతిపక్షాలు అసూయ చెందే విధంగా సిరిసిల్ల అభివృద్ధి జరుగుతోందని పేర్కొన్నారు. ఈ గోల్డెన్ తెలంగాణా మోడల్‌ను దేశానికంతా వివరించాలని, ప్రజలు బీజేపీ, కాంగ్రెస్‌ను కనుమరుగు చేసే రోజు త్వరలోనే వస్తుందని పేర్కొన్నారు. మహారాష్ట్ర వెళితే ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ అని మహారాష్ట్ర రైతులు గర్జిస్తున్నారని కేటీఆర్ తెలియజేశారు.