మూడో రోజు ఈడీ విచారణ, పాత ఫోన్లను చూపించిన కవిత
లిక్కర్ స్కామ్‌కు సంబంధించి ఎమ్మెల్సీ కవిత ఇవాళ మూడోసారి విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే కవిత ఈడీ ముందు రెండుసార్లు విచారణకు హాజరయ్యారు. కేసు విచారణ కీలక దశకు చేరుకోవడంతో ఇవాళ ఆమెను మరోసారి విచారించాలని ఈడీ భావిస్తోంది. కవితను నిన్న సుదీర్ఘంగా 10 గంటల పాటు ఈడీ విచారించింది. ఇంటి దగ్గర బయల్దేరి సమయంలోనే కవిత తాను ఉపయోగించిన ఫోన్లను కవర్లో పెట్టి చూపించారు. లిక్కర్ డీల్ తర్వాత తాను పదేపదే ఫోన్లను మార్చానంటూ ఈడీ చేస్తున్న ఆరోపణలకు ఇవాళ సమాధానం ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. తాను ఫోన్ మార్చడం చేశాను గానీ.. ధ్వంసం చేయలేదన్న సందేశాన్ని ఆమె ఇవ్వాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.

దర్యాప్తు సంస్థ కార్యాలయానికి వెళ్లే సమయంలో, మద్దతుదారులకు, మీడియాకు కవిత ఫోన్‌ల బ్యాగ్‌ను చూపించారు. ఈ రోజు ఈడీ చెబుతున్న ఫోన్లను సమర్పించబోతున్నట్లు సంకేతాలిచ్చారు. ఈడీ సమన్ల వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని కవిత ఆరోపించారు. దర్యాప్తు సంస్థ విభాగంగా మారిందని ఆక్షేపించారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీని రూపొందించే సమయంలో “సౌత్ గ్రూప్”కు అనుకూలంగా వ్యవహరించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో సహా ఈ కేసులో ఇప్పటివరకు 12 మందిని ఇప్పటి వరకు ఈడీ అరెస్టు చేసింది. సీబీఐ కేసులో సిసోడియా బెయిల్ పిటిషన్ విచారణ ఇవాళ ప్రత్యేక కోర్టు ముందుకు రానుంది.

