ఆజాదీకా అమృత్ మహోత్సవ్ సందర్భంగా ఘర్ ఘర్ కా తిరంగా
ఎందరో దేశభక్తుల త్యాగఫలితంగా మన స్వాతంత్ర భారతం అవతరించి 75 సంవత్సరాలు నిండుతున్న సందర్భంగా ప్రధాని మోదీ హర్ ఘర్ కా తిరంగా నినాదానికి పిలుపునిచ్చారు. ప్రజల్లో దేశభక్తిని, జాతీయభావాన్ని పెంపొందించేలా పలు కార్యక్రమాలను రూపొందించారు. దీనిలో భాగంగా ఆగస్టు 13 నుండి 15 వరకూ ప్రతీ ఇంటిలో జాతీయ జాండా ఎగురుతూ ఉండాలనీ ఆశాభావం వ్యక్తం చేసారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ సందర్భంగా గత ఆదివారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమం గురించి ప్రజలకు తెలియజెప్పడంలో భాగంగా పత్రికల్లో ప్రకటనలు, హోర్డింగ్స్, గీతాలు, పోస్టర్లు, సినిమా హాళ్లలో సంక్షిప్త చిత్రాల ప్రదర్శన, ర్యాలీలు, సైకిల్ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. పరిశ్రమలు, ఇతర సంస్థలు, దుకాణాలు, వాణిజ్య సముదాయాలు.. అన్నింటిపైనా జాతీయ పతాకాన్ని ఎగురవేసేలా ప్రజలను చైతన్య పరచాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వ కార్యాలయాల వద్ద, ఇళ్ల వద్ద జాతీయ జెండా ఆవిష్కరించాలని ఉద్యోగులకు జాతీయ పతాకాన్ని పంపిణీ చేస్తున్నారు.
జాతీయ జెండాకు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై మువ్వన్నెల జెండాను పగలే కాకుండా రాత్రివేళ కూడా ఎగురవేసేందుకు అనుమతి ఇచ్చింది. అలాగే కేవలం చేతితో తయారు చేసిన కాటన్ జెండాలనే కాకుండా.. మెషీన్లతో చేసే పాలిస్టర్ జెండాలను కూడా ఉపయోగించవచ్చని తెలిపింది. ఈమేరకు ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా 2002, ప్రివెన్షన్ ఆఫ్ ఇన్‌సల్ట్స్ టు నేషనల్ హానర్ యాక్ట్ 1971కు సవరణలు చేసినట్లు కేంద్రం వెల్లడించింది. ఫ్లాగ్ కార్పొరేషన్‌కు చెందిన జ్ఞాన్ షా మాట్లాడుతూ ఇంటిటా జాతీయజెండా ప్రచారంలో భాగంగా ఈ స్వతంత్ర దినోత్సవానికి అకస్మాత్తుగా జాతీయ జెండాకు డిమాండ్ పెరిగిపోయిందని చెప్పారు. కాగా శుక్రవారం ఈ ప్రచారంలో భాగంగా ఇండియన్ కోస్ట్ గార్డ్ సముద్రం అడుగుభాగాన జెండాను ఎగురవేసి దేశభక్తిని చాటుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా ఇంటింటా జాతీయజెండా కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ప్రభుత్వాలు అన్ని చర్యలు తీసుకుంటున్నాయి.