బీజేపీ యువనేత హత్యకు నిరసనలు – హోంమంత్రి నివాసం ముట్టడి
కర్ణాటక రాజకీయాలలో యువనేత ప్రవీణ్ హత్య వ్యవహారం మంటలు రేపుతోంది. మంగళవారం హత్యకు గురైన ప్రవీణ్ సంఘటన మరువకముందే గురువారం రాత్రి మహ్మద్ ఫాజిల్ అనే యువకుడు కూడా హత్యకు గురవ్వడం సంచలనం కలిగిస్తోంది. ఈ వరుస హత్యల నేపథ్యంపై బసవరాజ్ బొమ్మై ప్రభుత్వంపై హిందూ సంస్థల నుండీ అటు ప్రతిపక్షాలనుండీ కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రవీణ్ నెట్టార్ దక్షిణ కర్ణాటకకు చెందిన బీజేపీ యువజన విభాగం నేత. ఈయన హత్యకు నిరసనగా ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌కు చెందిన విద్యార్థి సంఘాలు ఆ రాష్ట్ర హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర నివాసాన్ని చుట్టుముట్టి, లోనికి వెళ్లేందుకు ప్రయత్నంచేసారు. దానితో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. వారిని తరలించడానికి ప్రయత్నాలు చేసారు. గత 4 రోజులుగా ABVP కార్యకర్తలు, విశ్వహిందూ పరిషత్ సభ్యులు ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. ప్రవీణ్ హత్యకేసు CBI కి అప్పగించాలని, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాను, దానికి సంబంధించిన అనుబంధ సంస్థలను వెంటనే రద్దు చేయాలని, వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేసారు. ఈనేపథ్యంలో దక్షిణ కర్ణాటక జిల్లాలలో పరిస్థితులు అదుపులో ఉండడానికి జిల్లాలో 144 సెక్షన్ అమలుచేస్తున్నారు.