NewsTelangana

సంతోష్‌జీకి నోటీసులు.. టీఆర్ఎస్ తొందరపాటు చర్య

ఎమ్మెల్యేల డ్రామా వ్యవహారంలో ఎన్నో అనుమానాలు

ఎమ్మెల్యేల డ్రామా వ్యవహారంపై టీఆర్ఎస్ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయ్. ఫామ్ హౌస్ వ్యవహారంలో నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు అంటూ జరుగుతున్న మొత్తం వ్యవహారం చినికి చినికి గాలివానలో మారుతోంది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై టీఆర్ఎస్ అనుసరిస్తున్న మొత్తం వ్యవహారంపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. టీఆర్ఎస్ పార్టీ తీరును దేశంలో ఒక్కరంటే ఒక్క రాజకీయ పార్టీ కూడా మాట్లాడుకోవడం లేదు. కనీసం ఈ వ్యవహారంపై స్పందించడానికి ఎవరూ కూడా ముందుకు రావడం లేదంటే టీఆర్ఎస్ పార్టీ క్రెడిబిలిటీ ఏంటో అర్థం చేసుకోవచ్చు. నలుగురు ఎమ్మెల్యేల డ్రామా వ్యవహారం విచారణ తీరుపై… బీజేపీ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తోంది. పార్టీ నేతలకు ఎవరికీ సంబంధం లేకున్నప్పటికీ.. కేసులో కావాలని ఒక్కొక్కరి పేర్లను జోడించడాన్ని బీజేపీ ఆక్షేపిస్తోంది. ముగ్గురు వ్యక్తులు మాట్లాడుకున్న మాటలను ఆధారంగా విచారణ జరిపించడం హేయమని ఆ పార్టీ అభిప్రాయపడుతోంది.

బీజేపీ అగ్రనేతను ఇరికించేందుకు టీఆర్ఎస్ కుట్ర

ఫామ్‌హౌస్ కేసులో బీఎల్ సంతోష్‌జీను ఇరికించేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపిస్తూ బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది. కుట్రలో భాగంగానే 41 A కింద నోటీసులు ఇచ్చారని.. ఇది చట్ట విరుద్ధమని అభిప్రాయపడింది. కోర్టుకు చెప్పిందొకటైతే.. విచారణ జరుగుతున్న తీరు మరోలా ఉందని పేర్కొంది. హైకోర్టు సింగిల్ జడ్జి అనుమతి తీసుకోకుండానే సిట్ నోటీసులు ఇచ్చిందని… బీజేపీ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి పిటిషన్‌లో పేర్కొన్నారు. నిందితుల వివరాలు, సమాచారాన్ని సీక్రెట్‌గా ఉంచాలని హైకోర్టు ఆదేశించినా.. నోటీసుల వివరాలు సోషల్ మీడియాలో వచ్చేలా చేసారని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎలాంటి ఆధారాలు లేకున్నా… కేసులో ఇరికించేందుకు కుట్ర జరుగుతోందన్నారు. మొబైల్, ల్యాప్ టాప్ ఇతర పరికరాలను తీసుకురావాలని… కోరడం చూస్తే.. బీజేపీ వ్యవహారాలను తెలుసుకోవాలకుంటున్నారా అన్న అనుమానం కలుగుతోంది. కేసులో సంబంధం లేని వ్యక్తులను విచారణ పేరుతో పిలిచి వేధించాలని భావిస్తున్నారని ప్రేమేందర్ రెడ్డి పిటిషన్‌లో ఆక్షేపించారు.

జాతీయ స్థాయిలో రచ్చ చేసేందుకే నోటీసులా?

వాస్తవానికి బీఎల్ సంతోష్‌జీ బీజేపీ ముఖ్యుల్లో అగ్రగణ్యులు. ఆయన పార్టీ వ్యవహారాలను చూసుకుంటారు. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా తర్వాత అత్యంత కీలకమైన వ్యక్తుల్లో సంతోష్‌జీకి గుర్తింపు ఉంది. అలాంటి వ్యక్తిని విచారణకు పిలవడం ద్వారా కేసీఆర్ బీజేపీని కావాలని కెలుక్కుంటున్నారన్న విశ్లేషణలు విన్పిస్తున్నాయి. డ్రామా కేసులో నిందితులు ఆయన పేరు చెప్పారని విచారణకు పిలవడం టీఆర్ఎస్ వ్యూహాత్మక తప్పిదమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సంతోష్‌జీకి నోటీసులు ఇవ్వడం తొందరపాటు చర్యగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇష్యూను.. ఇష్యూలాగా డీల్ చేయకుండా రాజకీయ కోణంలో టీఆర్ఎస్ ఆలోచించడం వల్ల ఇలా జరుగుతుందన్న భావన కలుగుతోంది. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని భావిస్తున్న కేసీఆర్ అందుకు.. బీజేపీ జాతీయ నేతలను టార్గెట్ చేస్తే తన ఇమేజ్ పెరుగుతుందని భావిస్తున్నారా అన్న చర్చ విన్పిస్తోంది. అందుకే పర్యవసానాలను బేరీజు వేసుకోకుండా తనకు ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తున్నారన్న చర్చ అటు టీఆర్ఎస్ పార్టీలోనూ చర్చ జరుగుతోంది.

ఫిరాయింపులు గురించి టీఆర్ఎస్ మాట్లాడటమేంటి?

దేశ వ్యాప్తంగా టీఆర్ఎస్ గురించి తెలియని వాళ్లంటూ ఉండరు. ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించడం గురించి టీఆర్ఎస్ చెప్పడమేంటన్న వర్షన్ వ్యక్తమవుతోంది. ఆ పార్టీ మూలాన్ని ఒక్కసారి ఆలోచించాలంటున్నారు విశ్లేషకులు. ప్రస్తుత వ్యవహారంలో టీఆర్ఎస్ పార్టీలోంచి నలుగురు ఎమ్మెల్యేల గురించి ఆ పార్టీ చెబుతున్న అంశాలను చూస్తే గురువింద నీతి చందంగా ఉంది. నలుగురు ఎమ్మెల్యేల్లో ముగ్గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్‌లోకి ఫిరాయించిన విషయాన్ని ఆ పార్టీ మరచిపోతోంది. కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచినవారిని, టీఆర్ఎస్ పార్టీలో కలుపుకొని రాజకీయాలు మాట్లాడటం విడ్డూరమంటున్నారు. తెలంగాణ ఏర్పాటు దగ్గర్నుంచి ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ పార్టీ ఎలా ఆకర్షించిందన్నదానిపైనా ఎంతో చర్చ జరిగింది. ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో నామరూపాల్లేకుండా ఎలా చేసిందో కళ్ల ముందే చూడొచ్చు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఎందరు పార్టీ ఫిరాయించారో చూశాం. ఇక 2018 ఎన్నికల్లో గెలిచిన వారిలో 12 మంది పదవులకు రాజీనామాలు చేయకుండానే గులాబీ కండువా కప్పుకున్నారు. ఒక ఎమ్మెల్యేకు మంత్రి పదవి కూడా ఇచ్చి రాజకీయాలకు టీఆర్ఎస్ కొత్త నిర్వచనం ఇస్తోంది.