ప్రకృతి అందాల నెలవు-శ్రీశైలం
శ్రీశైలం ప్రకృతి ప్రేమికులకు, పర్యాటకులకు కనువిందు చేయబోతోంది. గంగమ్మ సరాసరి శ్రీశైల మల్లికార్జునుని పాదాలచెంతకు సమయానికి చాలా ముందుగానే వచ్చేసింది. పర్యాటకులకు,ప్రకృతి ప్రేమికులకు తీయని వార్తను అందిస్తోంది శ్రీశైలం డ్యామ్. శివభక్తులకు ప్రముఖ ఆధ్యాత్మికకేంద్రం శ్రీశైలంలో కృష్ణమ్మ బిరబిరా పరుగులిడుతోంది.
ఈమధ్య కురిసిన భారీవర్షాలు, వరదలకు ఈసారి జూలైలోనే శ్రీశైలం డ్యామ్ పూర్తిగా నిండింది. జలాశయం నిండుకుండలా మారడంతో అధికారులి ఈరోజు ఉదయం 3గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఏపీ నీటిపారుదలశాఖ మంత్రి అంబటి రాంబాబు, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి కృష్ణమ్మకు పూజలు చేసి.. ప్రాజెక్టు గేట్లను ఎత్తారు. మూడు గేట్ల ద్వారా.. ప్రాజెక్టు దిగువకు నీటిని విడుదల చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు అయితే, శనివారం ఉదయానికి డ్యాంలో నీటిమట్టం 882.50 అడుగులకు చేరింది. శ్రీశైలం డ్యామ్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు. ప్రస్తుతం 202 టీఎంసీలు గా ఉంది. శ్రీశైలం డ్యామ్‌ను సందర్శించడానికి వచ్చే యాత్రికులతో పుణ్యక్షేత్రం కళకళలాడుతోంది.